షణ్ముఖ వ్యూహంతో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తా-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
287

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంది. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో సభ కోసం స్థ‌లం కేటాయించినందుకు ప్ర‌తిఫ‌లంగా, ఆ ఊరు అభివృద్ధి కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ 50 లక్షల రూపాయ‌లు తన ట్రస్ట్ తరపున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభ కోసం నెల రోజులుగా కష్టపడిన వారందరికీ అభినందనలు తెలిపారు. తాను ఈ రోజు రాజకీయాల్లో ఉన్నానంటే కారణం తన సోదరుడు నాగబాబు అని అన్నారు. పార్టీలో గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా నాదెండ్ల మనోహర్‌ తన వెంటే నడిచారు. వారికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. ఈ స‌భావేదిక‌కు దామోదరం సంజీవయ్య వేదికగా నామకరం చేసి స‌భ‌ నిర్వహించారు. దామోదరం సంజీవయ్య స్పూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందుకే ఈ వేదికకు దామోదర సంజీవయ్య పేరు పెట్టి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ముందు పలువురు జనసేన నాయకులు ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాకే ఏపీకి అప్పులు, కష్టాలు మొద‌ల‌య్యాయ‌ని మండిప‌డ్డారు.

జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై భారత్‌ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనదే అధికారమని చెప్పారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏరకంగా అభివృద్ధి చేస్తారో వివరించారు.

ఒక పార్టీ నడపాలంటే సిద్ధాంతం ఉండాలని. 2014లో ఆరుగురు కార్యవర్గంతో 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో పార్టీ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు ఆ కేంద్ర కార్యవర్గం 76 మందికి చేరిందని చెప్పారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల బలం 3 లక్షల 26 వేలకు చేరిందని.. త్వరలో 5 లక్షలకు చేరబోతోందని ప్రకటించారు. రెండున్నరేళ్లుగా వైకాపా పాలన ఎలా ఉంటుందో ఎదురుచూశానని.. వైకాపా వ్యక్తుల మీదగానీ, వైకాపా నాయకత్వంపై గానీ నాకు వ్యక్తిగత ద్వేషం లేదని పవన్ చెప్పారు. ఇంట్లో దిగినప్పుడు శుభంతో మొదలుపెడతామని. కానీ ఈ ప్రభుత్వం వస్తూనే కూల్చివేతలతో, అశుభంతో పాలనను మొదలుపెట్టిందన్నారు.

ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను రోడ్డు పడేశారని. వైసీపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అడుగడుగునా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. సీఎంలు మారినప్పుడుల్లా విధానాలు మారవని.. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రైతులు భూముల ఇచ్చారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రాజు మారిన ప్రతిసారీ రాజధాని మారదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని.. అప్పుడు ఈ వైకాపా నాయకులంతా ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు.

ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ కొమ్ములు విరుస్తామని హెచ్చరించారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామని. విశాఖ, విజయవాడను హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతామని.. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తామని పవన్ చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ ఇసుకను ఉచితంగా అందిస్తామని. సులభ్‌ కాంప్లెక్సుల్లో పనిచేసే ఉద్యోగాలు కాకుండా మీ కాళ్లమీద మీరు నిలబడగలిగేలా, ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం తరఫు నుంచి రూ.10లక్షలు అందిస్తామన్నారు.

రాష్ట్రంలో ఆదాయం భారీగా వస్తున్నప్పటికీ.. దుర్వినియోగమే ఎక్కువగా అవుతోందని అన్నారు పవన్. పార్టీ ప్రకటనల కోసమే రూ.400 కోట్లు వృథా చేశారని వైసీపీ పై ధ్వజమెత్తారు. పార్టీ రంగులు వేసుకునేందుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ వృథా ఖర్చు బదులు ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వవచ్చు కదా? అని పవన్ ప్రశ్నించారు. ఇలా దుబారా చేయడానికి డబ్బులు ఉంటాయిగానీ.. ఉద్యోగుల జీతాలకు మాత్రం డబ్బులు ఉండవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం ఎటు పోతుందో అడిగేవారు లేరని అన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పు అని చెబుతున్నారన్న పవన్‌కల్యాణ్‌.. అప్పులు తీర్చే మార్గాలను వెతకాలని సూచించారు. వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంటే ఎలా? అని నిలదీశారు. రూ.లక్ష కోట్ల ఆదాయం సద్వినియోగం చేయకపోతే.. ప్రభుత్వంలో లోపమున్నట్లేనని తేల్చి చెప్పారు. ఈ విషయాలు ప్రశ్నిస్తే.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు.

అల్లం వెల్లుల్లి- వెల్లంపల్లి, బంతి చామంతీ- అవంతీ అంటూ వైసీపీ మంత్రులపై సెటైర్లు విసిరారు పవన్ కళ్యాణ్. తాను సభకు వచ్చే ముందే- కొందరు వైసీపీ లీడర్లు తిట్టారని.. అందుకే ఇలా అనాల్సి వచ్చిందనీ వివరించారు సేనాని పవన్ కళ్యాణ్‌. భారతీయులంతా నా సహోదరులని ప్రతిజ్ఞ చేస్తాం. అదే వైసీపీ ఆంధ్రప్రదేశ్ నా అడ్డా అన్న ప్రతిజ్ఞ చేసిందంటూ సంచలన కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్.

ఇదంతా ఒక ఎత్తు అయితే, జ‌న‌సేనాని ప్ర‌సంగం ముగింపు ద‌శకు చేరుతున్న కొద్ది నిప్పులు చెరిగేలా సాగింది. వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, చివరగా కొన్ని మాటలు చెప్పి ప్రసంగాన్ని ముగిస్తున్నానంటూ ఆవేశపూరిత సందేశాన్ని వినిపించారు.

“పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతోంది. పక్కవాడి సౌభాగ్యం బాలిశుడి గుండెల్లో మంటలు రేకెతిస్తోంది. ప్రజల నోళ్లు కొట్టి, ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజదొంగలు రాజులై రారాజులై ఏలుతున్నారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ కవితాపంక్తులు వర్తమాన వైసీపీ పాలకులకు చాలా సహజంగా వర్తిస్తాయి… కర్ణుడికి కవచ కుండలాల్లాగా అతికినట్టు సరిపోతాయి. బాలిశుడు అంటే మూర్ఖుడు.. నా ఉద్దేశంలో దుర్మార్గుడు అని అర్థం.

అధికార మదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఇదే జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశం!” అని వ్యాఖ్యానించారు.

అలాగే, బీజేపీ నేతలు, పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని, ఆ రోడ్ మ్యాప్ ఎప్పుడిస్తారో చెబితే వైసీపీని ఎలా దించాలో తాము చూసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని, పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలేసి రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.

“కూల్చేవాడుంటే కట్టే వాడుంటాడు… విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు… చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు… తలెగరేసే పాలకుడుంటే ఎగిరి తన్నే పరశురాముడు ఉంటాడు… దోపిడీ చేసే వైసీపీ గూండా గాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జనసైనికులు ఉంటారు… వైసీపీది విధ్వంసం జనసేనది వికాసం. వారిది ఆధిపత్యం… మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా…. ఇది జనసైనికుల గడ్డ… జై జనసేన” అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగం ముగించారు.

వాకిటి వెంక‌టేశం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌