1995-1996 బ్యాచ్ పూర్వ‌ విద్యార్థుల ముఖాల్లో వెలుగులు
2024లో ఫ్యామిలీస్‌తో గెట్ టు గెద‌ర్ ఏర్పాటు చేయాల‌ని తీర్మానం

(వార్తాలోకం ప్ర‌త్యేక‌ ప్ర‌తినిధి – వాకిటి వెంక‌టేశం)

యాదాద్రి జిల్లా యాద‌గిరిగుట్ట మండ‌లం మాసాయిపేట గ్రామంలోని జ‌డ్పీ ఉన్న‌త పాఠ‌శాలలో 1995-1996 బ్యాచ్ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ఆత్మీయ స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. సుమారు 27 ఏళ్ల త‌ర్వాత ఒక‌రికొక‌రు క‌లుసుకుని యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త‌మకు విద్యాబుద్దులు నేర్పిన గురువుల‌కు పూర్వ‌విద్యార్థులంతా క‌లిసి జ్ఞాపిక‌ల‌ను అంద‌జేసి, స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా గురువులు అంజిరెడ్డి, మ‌ల్లేశం, గోవ‌ర్థ‌న్‌, క‌రుణాక‌ర్ విజ‌య‌ల‌క్షి, వ‌సుంధ‌ర‌,గోదాదేవి ప్ర‌సంగించారు. ఆనాడు (1996) పుస్త‌కాల్లో పాఠాల‌ను నేర్పిన గురువులు, నేడు త‌మ‌ ప్ర‌సంగంలో బ‌తుకు తాలుకు పాఠాలు, త‌మ అనుభ‌వాల‌ను రంగ‌రించి, అంద‌రికి అర్థ‌మ‌య్యేలా బోధించారు. వాటిల్లో ముఖ్యంగా త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించాల‌ని, వృద్దాశ్ర‌మంలో వారిని చేర్పించకూడ‌ద‌ని, చివ‌రాంకంలో త‌ల్లిదండ్రుల‌ను ప్రేమ చూడాల‌ని వారు సూచించారు.

పూర్వ విద్యార్థులు త‌మ పిల్ల‌ల‌కు మంచి నడ‌వ‌డిక నేర్పించాల‌ని, ఈ పోటీ ప్ర‌పంచంలో త‌ట్టుకుని నిల‌బ‌డేలా వారిని తీర్చిదిద్దాల‌ని వివ‌రించారు. అంతేకాకుండా ఆరోగ్య‌మే మ‌హాభాగ్యమని, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని వారు బోధించారు. రోజూ వ్యామ‌యం, యోగా లాంటివి, చేసి, రోగాల‌ను దూరంగా ఉండాల‌ని వారు వివ‌రించారు. ఒక్కో గురువు బ‌డిలో చెప్ప‌ని బ‌తుకు పాఠాల‌ను త‌మ ప్ర‌సంగంలో రంగ‌రించి, పూర్వ విద్యార్థులంద‌రికి అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు. అంతేకాకుండా గురువులు ఈ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో తాము ఈ పాఠ‌శాల‌లో ఎదుర్కొన్న కొన్ని సంఘ‌ట‌న‌లు, వాటి ద్వారా జ‌రిగిన ప‌రిణామాల‌ను గుర్తు చేసుకున్నారు. 27 ఏళ్ల త‌ర్వాత త‌మంద‌రిని గుర్తు పెట్టుకుని, ఆత్మీయ స‌మ్మేళ‌నానికి ఆహ్వానించ‌డం, చాలా సంతోషంగా ఉంద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

అంత‌కుముందుకు 95-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా ఒక్కొక్క‌రు గ‌డిచిన 27 ఏళ్లుగా ఏమి ప‌ని చేశారు. ఎంత వ‌ర‌కు చ‌దువుకున్నారు. విద్య, ఉద్యోగం, కుటుంబం, పిల్ల‌లు, బ‌రువులు, బాధ్య‌త‌లు వంటి అంశాలపై మాట్లాడారు.
27 ఏళ్ల సుదీర్ఘ స‌మ‌యం త‌ర్వాత క‌లుసుకున్న పూర్వ విద్యార్థుల‌ ముఖాల్లో ఆనందం, సంతోషమ‌నే వెలుగులు క‌నిపించాయి. గ‌తంలో ఇదే పాఠ‌శాల‌లో కొన్నిబ్యాచ్‌లు కూడా ఆత్మీయ స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాయ‌ని, ఆ కార్య‌క్ర‌మానికి కూడా తాము హాజ‌ర‌య్యామ‌ని చెప్పిన గురువులు, ఈ రోజు 95-96 బ్యాచ్ వాళ్లు చేసినంత ఘ‌నంగా మిగిలిన వాళ్లు చేయ‌లేక‌పోయార‌ని కొనియాడారు. తాము విద్యాబుద్దులు నేర్పిన పిల్ల‌లు ప్ర‌యోజ‌కులు అయ్యార‌ని గురువులు ఒకింత‌ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ‌ సమ్మేళ‌నం ఏర్పాటు చేయాల‌నే పెద్ద టాస్క్‌ని చేయ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని అని, అంద‌రి అడ్రసులు, పోన్ నంబ‌ర్లు సేక‌రించి, అది సుదీర్ఘ కాలం (27 ఏళ్లు) త‌ర్వాత అంద‌రిని క‌లుపుకుని గెట్ టు గెదర్ ని విజ‌య‌వంతం చేయ‌డం మామూలు విష‌యం కాద‌ని గురువులు కితాబిచ్చారు. కొంత మంది పూర్వ విద్యార్థులు క‌లిసి ఈ కార్య‌క్ర‌మాన్ని భుజానికి వేసుకుని ఇంత ఖ‌ర్చు పెట్టుకుని ఈ కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయ‌డం, ఎక్క‌డెక్క‌డో వున్న మా టీచ‌ర్లంద‌రిని ఒకే వేదిక‌పైకి తీసుకురావ‌డం సంతోషంగా ఉంద‌ని వారు చెప్పుకొచ్చారు.

అయితే, వాస్త‌వానికి ఈ పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం 2019లోనే జ‌ర‌గాల్సింద‌ని, కొంద‌రి అడ్రసులు, ఫోన్ నెంబ‌ర్లు దొర‌క్క‌పోవ‌డం వ‌ల్ల ఆ ఏడాది ఆత్మీయ సమ్మేళనం జ‌ర‌ప‌లేక‌పోయామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ఆ మ‌రుస‌టి ఏడాది 2020 క‌రోనా కాటేసిన సంవ‌త్స‌రం కావడంతో, ఈ క‌ష్ట స‌మ‌యంలో రిస్క్ తీసుకోవ‌ద్ద‌నే ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసిన‌ట్లుగా వారు చెప్పారు.
స‌మ‌యం మించిపోతోంది మిత్ర‌మా, ఇప్ప‌టికైనా త్వ‌ర‌ప‌డాలి, ఆత్మీయ స‌మ్మేళ‌నానికి పూనుకోవాల‌ని కొంద‌రు మిత్రులు ప‌దే ప‌దే గుర్తు చేస్తూనే ఉన్నారు. క‌క్కొచ్చినా… క‌ళ్యాణ గ‌డియ వ‌చ్చిన ఆగ‌దానిది నానుడి. ఈ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ ఏడాది అన‌గా (2023)లో ఎండాకాలం ఎండ‌లు మండిపోతున్న స‌మ‌యంలో కొంద‌రు ఇదే స్కూళ్లో పూర్వ విద్యార్థుల స‌మ్మేళనాలు జ‌రుపుకోవ‌డం, కొన్ని సంవ‌త్స‌రాలుగా తాము త‌ల‌పెట్టిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ స‌మ్మేళ‌నం ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డం బాధ క‌లిగించింద‌ని నిర్వాహ‌కులు వాపోయారు.

ఇప్ప‌టికైనా ఆల‌స్యం అమృతం విషం అనే నానుడిని గుర్తు చేసుకుని అనుకున్న‌దే త‌డ‌వుగా మొబైల్‌ ఫోన్‌ని అందుకుని చ‌క చ‌కా కొంద‌రికి ఫోన్లు చేసి, ఒక ఐదుగురు పూర్వ విద్యార్థులు నిర్వాహ‌కులుగా ఏర్ప‌డి, జూన్ 11న పూర్వ విద్యార్థుల ఆత్మీయ స‌మ్మేళనం నిర్వ‌హించాల‌ని డిసైడ్ చేశామ‌ని వారు వివ‌రించారు. అంతే అనుకున్న‌దే త‌డ‌వుగా కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నామ‌ని వారు చెప్పుకొచ్చారు. పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేయ‌డానికి ఆ ఐదుగురు పూర్వ విద్యార్థులు ఐదు ర‌కాల బాధ్య‌త‌ల‌ను భుజానికి వేసుకున్నార‌ని వారు వివ‌రించారు.
ఇందులో ముఖ్యంగా అంద‌రికి స‌మాచార‌మిచ్చే బాధ్య‌త‌ను వాకిటి వెంకటేశం, భోజ‌న వ‌స‌తి, ఏర్పాట్ల‌కు సంబంధించి క‌ట్కం న‌రేంద‌ర్‌, స్టేజీ, డిజేల ఏర్పాటుకు సంబంధించిన బాధ్య‌త‌ను క‌ట్కం బాల‌న‌ర్స‌య్య‌, టెంట్‌, కుర్చీలకు సంబంధించిన బాధ్య‌త‌ల‌ను శివ‌లింగం, పోటోలు, వీడియోల‌కు సంబంధించిన బాధ్య‌త‌ల‌ను బురుజుకింది చిన్న మ‌ల్లేష్‌, కార్య‌క్ర‌మం రూప‌క‌ల్ప‌న‌, నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌లకు సంబంధించి గుజ్జ శివ‌రాజ్, మ‌హిళ‌ల‌కు స‌మాచారం, వారిని తీసుకొచ్చే బాధ్య‌త‌ను ఉద‌య‌రాణి చూసుకోవాల‌ని ఏర్పాట్ల‌లోగాని, భోజ‌న వ‌స‌తి కార్య‌క్ర‌మాల్లో గాని, ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాల‌ని ముందే నిర్ణ‌యించిన‌ట్లుగా నిర్వాహ‌కులు వివ‌రించారు. ఎక్క‌డ రాజీప‌డ‌కుండా, ఎవ‌రికి అప్పగించిన టాస్క్‌ని వాళ్లు ప‌రిపూర్ణంగా నిర్వ‌ర్తించి, గురువుల‌తో శ‌భాష్ అనిపించుకున్నార‌ని ఆత్మీయ స‌మ్మేళ నిర్వాహ‌కులు చెప్పుకొచ్చారు.

అయితే, త‌మ‌తో ప‌దేళ్లు క‌లిసి చ‌దివిన అమ్మాయిలు, స్నేహితులే కాదు… త‌మ తోబుట్టువుల‌తో స‌మాన‌మ‌ని, 27 ఏళ్ల సుదీర్ఘ స‌మ‌యం త‌ర్వాత క‌లుసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని, ఈ శుభ స‌మ‌యంలో మా తోబుట్టువుల‌కు (పూర్వ విద్యార్ధినులు) చీర‌లు పెట్టి పంపించాల‌ని నిర్ణ‌యించుకున్న పూర్వ విద్యార్థి గుణ‌గంటి బాబూరావు వేలాది రూపాయ‌ల ఖ‌ర్చును సైతం లెక్క చేయ‌కుండా, త‌న తోబుట్టువుల‌ ముఖాల్లో ఆనందాన్ని చూడాల‌ని అనుకున్నారు. చూశారు. ఆ తోబుట్టువుల ఆత్మీయ‌త‌ను కూడా అందుకున్నారు. ఈ అనుభూతి వెల‌క‌ట్ట‌లేనిద‌ని, ఈ రోజు త‌న జీవితంలో మ‌రిచిపోలేని రోజుగా గుర్తు పెట్టుకుంటాన‌ని స‌ద‌రు పూర్వ విద్యార్థి గుణ‌గంటి బాబూరావు బావోద్వేగానికి లోన‌యిన‌ట్లుగా నిర్వాహ‌కులు వివ‌రించారు.

మ‌రోవైపు సుదీర్ఘ కాలం త‌ర్వాత క‌లుసుకున్న మిత్రులంతా డీజేలు పెట్టుకుని, పాత‌, కొత్త సాంగుల‌కు స్టెప్పులు వేశారు. ఒక‌వైపు అబ్బాయిల‌ తీన్మార్ స్టెప్పులు, మ‌రోవైపు అమ్మాయిల బ‌తుక‌మ్మ ఆట‌లు, నిజంగా కోలాహ‌లంగా క‌నిపించింది ఆ సాయంత్రం. ఎన్నాళ్ల‌కో దొరికిన ఆ చ‌క్క‌ని సాయంత్రాన్ని స్నేహితులంతా ఆసాంతం త‌న‌వితీరా ఆస్వాదించారని నిర్వాహ‌కులు నిజాయితీగా ఒప్పుకున్నారు.

ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళ‌న కార్య‌క్ర‌మాన్ని త‌న‌దైన శైలిలో రూప‌క‌ల్ప‌న చేసి, ఔరా అనిపించేలా ఎగ్జిక్యూట్ చేసిన గుజ్జ శివ‌రాజ్ (పూర్వ విద్యార్థి)కి త‌న స్నేహితులు, స్నేహితురాళ్ల‌తోపాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ఆత్మీయ స‌మ్మేళ‌నం అంద‌రి మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసింద‌ని, ప్ర‌తి ఒక్క‌రు త‌మ ముఖంలో కొండంత నింపుకుని, తిరిగి త‌మ త‌మ ఇళ్ల‌కు వెళ్లార‌ని చెప్ప‌డానికి గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని నిర్వాహ‌కులు చెప్పుకొచ్చారు.

ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో షేక్ ల‌తీఫ్ సార్ రాసి, పాడిన పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

వ‌చ్చే ఏడాది (2024) వేస‌వి సెల‌వుల్లో ఈ పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నాన్ని ఫ్యామిలీ గెట్ టు గెద‌ర్‌గా హైద‌రాబాద్‌లోని ఏదైనా రిసార్ట్‌లో ఏర్పాటు చేయాల‌ని తీర్మానం చేసిన‌ట్లుగా నిర్వాహ‌కులు తెలిపారు. అయితే, ఆ కార్య‌క్ర‌మానికి ఇదే విధంగా ప్ర‌తి ఒక్క‌రు ఫ్యామిలీతో హాజ‌రై, విజ‌య‌వంతం చేయాల్సిందిగా నిర్వాహ‌కులు కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో పూర్వ విద్యార్థులు క‌ట‌కం న‌రేంద‌ర్‌, గుణ‌గంటి బాబూరావు, కైరంకొండ సంతోష్‌, షేక్ మ‌న్సూర్‌బాబు అలియాస్‌ మంజుబాబా, గ‌జం పాప‌య్య‌, న‌ర్సింహులు (య‌సోజిగూడెం), బురుజుకింది పెద్ద మ‌ల్లేష్‌, బుడిగె శ్రీను (బాహుపేట‌), పిడుగు స్వామి (బాహుపేట‌), మొలుగు ర‌వింద‌ర్‌, బేతి వేణుగోపాల్‌రెడ్డి, వాకిటి వెంక‌టేశం, తోట‌కూర యాక‌య్య‌, సిల్వేరు రాజు, శివ‌లింగం, గ‌జం చంద్ర‌మౌళి, ఈరాపురం న‌ర్సింగ్‌రావు, బురుజుకింది చిన్న మ‌ల్లేశ్‌, బ‌ల్ల‌రాజు, విద్యార్ధినులు గొట్టిప‌ర్తి విజ‌య‌ల‌క్ష్మి, ఎర్రోజు ఉద‌యరాణి, గుజ్జ‌వ‌ర‌ల‌క్ష్మి, క‌ళ్లెం ఉపేంద్ర‌, క‌ట‌కం శ‌శిరేఖ‌, క‌ట‌కం మ‌హాల‌క్ష్మి, బంద‌కింది రాజమ‌ణి, బబ్బూరి సంజీవ‌, బుత్కూరి స్వ‌ప్న‌, అరుణ (బాహుపేట‌), దుడ‌క కృష్ణ‌వేణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ స‌మ్మేళ‌నం చిత్ర‌మాలిక‌