దేశమా..? హిత‌మా..?

0
303

 

భార‌త దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడేళ్లు పూర్త‌యింది. మోదీ భార‌త‌దేశానికి 14 వ ప్రధానిగా 2014 మే 26వ తేదీన అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుతమున్న‌కరోనా కష్టకాలంలో విజయోత్సవాలు చేసుకొనే పరిస్థితులు లేవు. అయినప్పటికీ, నరేంద్రమోదీ తిరుగులేని, నాయకుడిగానే నిలిచారు. 2024లో రాబోయే సార్వ‌త్రిక ఎన్నికల్లోనూ మళ్ళీ మోదీ నే గెలుపొందుతార‌ని, అధికారాన్ని చేప‌డుతార‌ని ఎక్కువ మంది విశ్వాసంతో ఉన్నారు. కరోనా కష్టాలు, ఒత్తిళ్ళు, వివిధ అంశాల నేపథ్యంలో, మోదీ గ్రాఫ్ పడిపోయిందనే మాటలు, ఈ మధ్య కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను అధిగమించి, తానేంటో నిరూపించి, ప్రజాహృదయాలను మళ్ళీ గెలుస్తాడనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఈ ఏడేళ్ళ పాలనను ఒకవైపు నుంచి చూస్తే అంతా మంచిగానూ, ఇంకోవైపు నుంచి చూస్తే ఆన్నీ చెడుగానూ క‌నిపిస్తుంద‌న‌డంలో సందేశం లేదు.

2019 ఎన్నికల ముందు బిజెపికి మెజారిటీ తగ్గుతుందని ఎక్కువమంది భావించారు. కానీ, ఫలితాలు అందుకు భిన్నంగా వ‌చ్చాయి. బిజెపికి ప్ర‌జ‌లు అద్భుత‌మైన మెజార్టీని క‌ట్ట‌బెట్టారు. దీంతో మోదీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అదే సమయంలో 2014 నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ గణనీయంగా తగ్గిపోయింది. కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అగ్రనేత‌లు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వారి వ్యక్తిగత గ్రాఫ్ ను పెంచుకోవడంలోనూ ఘోరంగా విఫలమయ్యారు. అసలు 2014లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడానికి ప్రధానమైన కారణాలలో కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యమే ముఖ్య‌మైంది. 2009 నుంచి 2014 వరకూ సాగిన మన్ మోహన్ సింగ్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఖ్యాతి పెర‌గ‌డం మాట అటుంచి, ఆ పార్టీ గ్రాఫ్ క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. అంతేకాకుండా చెడ్డపేరు తెచ్చుకుంది. వ్యక్తిగతంగా అవినీతిలేని, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా మన్ మోహన్ కు మంచిపేరు ఉన్నప్పటికీ, సోనియా గాంధీ మొదలైన వారి నీడలో ఆయన పాలనకు చెడ్డపేరు వచ్చింది. కాంగ్రెస్ ప‌దేళ్ల పాల‌న ప్ర‌జాధ‌ర‌ణ‌ను పొంద‌లేక‌పోయింది. ఫ‌లితంగా ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయం వైపు మొగ్గుచూపారు. బిజెపికి, న‌రేంద్ర‌మోదీ ప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యారు.

న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీ. గుజరాత్ సీఎంగా మోదీ చాలా సుదీర్ఘ కాలం పాలించారు. అప్పటి వ‌ర‌కు ఆయన కేవలం ఒకరాష్ట్ర పాలకుడు మాత్రమే. కేంద్రమంత్రిగా ఎప్పుడూ పని చేయ‌లేదు. పార్టీ పరంగానూ, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పద‌వులు కూడా అలంక‌రించ‌లేదు. కానీ, ఆయన శైలికి, తీరుకు దేశ ప్ర‌జ‌లంతా ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువత, విద్యాధికులు ఆయనకు కనెక్ట్ అయ్యారు. ఆయన పట్ల అచంచలమైన విశ్వాసాన్ని, అనిర్వచనీయమైన ప్రేమను, ఆకర్షణను పెంచుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ నరేంద్ర మోదీని గొప్పగా కీర్తించారు. వరుస పెట్టి గొప్ప గొప్ప కథనాలు ప్ర‌చురించారు. 2014 ఎన్నికల్లో మోదీ మానియాతో అద్భుత‌మైన విజ‌యం ల‌భించింది. అదే ఏడాది న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధాన‌మంత్రి సింహాస‌నాన్ని అలంక‌రించారు. 2019లోనూ అంతకు మించిన గెలుపును సొంతం చేసుకున్నారు. వరుసగా రెండవసారి కూడా ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దేశ ప్ర‌జ‌ల హృద‌యాల‌పై త‌న‌దైన శైలిలో చెరిగిపోని ముద్ర వేశారు న‌రేంద్ర‌మోదీ.

రెండు సార్లు అమోఘ‌మైన మెజార్టీ ల‌భించ‌డం వ‌ల్ల‌, నియంతృత్వ పోకడలతో ఏకస్వామ్యంగా సాగుతున్నారని ఆరోప‌ణ‌లున్నాయి. ఇప్ప‌టికీ మోదీ జాతీయ మీడియాతో మాట్లాడిన దాఖ‌లాలు లేవు. ఏక‌ప‌క్షంగా మాట్లాడుకుంటూ వెళ్లిపోవ‌డం, తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది చెప్పి, మీడియా స‌మావేశాల‌ను ముగించ‌డంలో దేశంలోనే కొత్త ట్రెండ్ తీసుకొచ్చార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఇటు మీడియాకు, అటు ప్ర‌తిప‌క్షానికి ప్ర‌శ్నించే అవ‌కాశమే ఇవ్వ‌క‌పోవ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. బిజెపిని రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో ప్రతిపక్షాలపై అప్రజాస్వామికంగా వెళ్తూ సీబిఐ, ఈడి వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ సంస్కృతిని మించి ముందుకు వెళ్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో, తమకు వ్యతిరేకులు అనే భావనలో ఉన్న ముఖ్యమంత్రులు, నేతల పట్ల కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తున్నార‌నే మాట‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. బిజెపిలో అమిత్ షా వంటి ఒకరిద్దరు నేతలు తప్ప, మిగిలిన మంత్రులు, నేతలను దూరం పెడుతున్నార‌ని, ఆ పార్టీలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఆర్ ఎస్ ఎస్ వంటి వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేస్తున్నార‌ని, హిందూత్వ ఎజెండాతో మైనారిటీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నార‌ని, లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.

పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి అమలు, జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దు , పౌరసత్వ సవరణ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలు, ఎన్నికల సమయంలో తప్ప, మిగిలిన సమయాల్లో రాష్ట్రాలలో పర్యటించి, సాధకబాధకాలు తెలుసుకొని, అసమానతలు, ఇబ్బందులు, కష్టాలు తెలుసుకొక పోవడం, కరోనా కష్టనష్టాలను అరికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందడం వ‌ల్ల‌ ల‌క్ష‌లాది కూలీలు నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. వీటన్నింటినీ నాణానికి మరోవైపుగా, ప్రతిపక్షాలతో పాటు కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఏదేమైనా దేశంలో మ‌రీ ముఖ్యంగా కేంద్రంలో బిజెపికి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం, ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ చ‌తికిల‌ప‌డ‌టం, సోనియా గాంధీ త‌ర్వాత ఆ పార్టీ ప‌గ్గాల‌ను రాహుల్ గాంధీకి అప్ప‌గించినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోనూ, పార్టీ ప్ర‌తిష్ట మ‌రింత దిగ‌జార‌డం వంటి ప‌రిణామాలు వేగంగా జ‌రిగిపోయాయి. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ బిజెపికి ఎదురెళ్లి కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు పుంజుకుని అధికారంలోకి వ‌చ్చే దిశ‌గా అడుగులు వేస్తుందా ? అంటే అది అనుమాన‌మేనంటున్నారు ప‌రిశీల‌కులు. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో మొద‌టి నుంచి రెండో స్థాయి నాయ‌కుల‌ను ఎద‌గ‌నివ్వ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని వారు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లోనైనా నాయ‌క‌త్వ మార్పు జ‌ర‌గ‌డం, లేదా ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌జల‌కు మ‌రింత చేరువ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం వంటి ప‌రిణామాలు జ‌రిగితే ఆ పార్టీకి ప్ర‌జ‌లు తిరిగి పూర్వ వైభ‌వాన్ని క‌ట్ట‌బెట్టే అవ‌కాశం లేక‌పోలేదు.

ఇక‌పోతే, మోదీ.. ఈ ఏడేళ్ల పాలన,ప్రవర్తన, ప్రగతిపై సమీక్ష, ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు సాగితే సుపరిపాలకుడనే కీర్తి తప్పక దక్కుతుంది. ప్రజాపతి నుంచి ప్రజలు కోరుకొనేది సంక్షేమం, అభివృద్ధి, శాంతి, సంర‌క్ష‌ణ‌, సౌభాగ్యాలు మాత్రమే. ఆ దిశగా నరేంద్రమోదీ ముందుకు సాగుతారని ఆశిద్దాం.
ఆయనపై భారత ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొన్నారు. ఓట్లు వేసి, రెండు సార్లు గొప్ప గెలుపును అందించారు. దాన్ని మోదీ గ్రహించి, ప్రతిగా, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని విశ్వసిద్దాం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇంకా సుమారు మూడేళ్ల సమయం ఉంది. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని, ప్రజా విశ్వాసాన్ని చూరగొంటే, మళ్ళీ ఆయనను ప్రధానిగా కూర్చోపెడతారు. లేకపోతే, ఇంకో పక్షానికి, మరో నాయకుడిని పట్టం కడతారు. అధికారం ఎల్లకాలం ఏ ఒక్కరి సొత్తు కాదని చరిత్ర చెబుతూనే వుంది. టీ అమ్ముకొనే ఒక అతి సాధారణమైన స్థాయి నుంచి, దేశంలోనే అత్యున్న‌త స్థాయి దేశ ప్ర‌ధానమంత్రి కాగలిగిన గొప్ప అవకాశాన్ని, అద్భుతాన్ని “ప్రజాస్వామ్య వ్యవస్థ” కలిపించింది. దాన్ని నిలబెట్టాల్సిన, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత న‌రేంద్ర‌మోదీదే.

-వాకిటి వెంక‌టేశం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌