వైఎస్ఆర్ ప్రథమ సంస్మరణ సభ

0
533

వార్తాలోకం ప్రతినిధి – హైదరాబాద్ జూన్ 2:
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యెన్నా శ్రీనివాసరావు ప్రథమ సంస్మరణ సభ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు వివిధ పత్రికలు, వివిధ ఛానళ్లల్లో పని చేసినా, పని చేస్తున్నా సీనియర్ జర్నలిస్టులు హాజరై, వైయస్సార్ గారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్ తో తమకున్న అను బంధాన్ని, బంధాన్ని గుర్తు చేసుకుంటూ సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనాన్ని పుస్తకరూపంలోకి తీసుకు వచ్చారు. ఈ సంస్మరణ సభకు హాజరైన మిత్రులు, హితులు, సన్నిహితులు లకు ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ ని గుర్తు చేసుకుంటూ, వైయస్సార్ గారి తో తమకున్న అనుబంధాన్ని వక్తలు అందరు నెమరువేసుకున్నారు. వైయస్సార్ లేని లోటు తీరనిదని, అలాంటి అరుదైన జర్నలిస్ట్ ని కోల్పోవడం నిజంగా బాధాకరమని వక్తలు అందరు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, వైయస్సార్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఇవ్వడం, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేయాలని వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణ పత్రిక, న్యూస్ వేవ్స్, 99 టీవీ వంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయనది. ఈ క్రమంలోనే ఎంతోమంది మిత్రులను, సన్నిహితులను సంపాదించుకున్నారు. ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట, చెప్పగలిగే మాట నిజాయితీకి నిలువెత్తు రూపం వైయస్సార్ అని మాత్రమే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నైనా నిజాయితీగా ఎలా ఉండాలో వైయస్సార్ ఉండి చూపించారని, ఆయన దగ్గర నుంచి దీన్ని అందరు నేర్చుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. ఈ సంస్మరణ సభ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వర్రే గంగాధర్ వందన సమర్పణ చేశారు. అంతకుముందు సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, పసుల శ్రీనివాస్, పెద్దిరాజు, ప్రసాదరావు, యాంకర్ రోజా తదితరులు ప్రసంగించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సన్నిహితులు, హితులు, స్నేహితులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.