మ‌హిళ‌లూ…మ‌హారాణులు..! కానీ..!

0
331

స్త్రీ ఆకాశంలో సగం అంటారు. అవ‌కాశాల్లోనూ స‌గం అంటారు. కానీ, నేల మీద మాత్రం తగిన ప్రాముఖ్యత ఇవ్వరు. అడ్డాకూలీల దగ్గర నుంచీ ఆఫీసర్ల వరకూ ఆడవారు చేసే పనికి చాలీచాలని వేతనమే లభిస్తుంది. స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం, కాగితాల‌కే ప‌రిమిత‌మైంది. దాన్ని అమ‌లు చేసిన దాఖ‌లాలు మాత్రం ఎక్క‌డ క‌నిపించవు. ఈ విషయం మన కళ్ల ముందు కనిపించేదే! ఇది నిజమని రుజువు చేసేందుకు కావల్సినన్ని పరిశోధనలు కూడా జరిగాయి. నోరు తెరిచి అడిగినా కూడా ఆడవారికి జీతాలు పెరగవనీ, సున్నితంగా ఉండే ఆడవారి జీతాలు అస్సలు మెరుగుపడవనీ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

ఈ స‌మాజంలో అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల మన ఆలోచనా ధోరణి తప్ప’. అవును ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అనేది ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. మ‌న దేశంలో స్త్రీని శ‌క్తి స్వ‌రూపినిగా కొలుస్తాం. భారత మాతగా ఆరాధిస్తాం. మన పురాణాలను గమనించినట్లైతే భూమాతా, దుర్గామాత, పార్వతీ, పోచమ్మ ఎల్లమ్మ, క‌ట్ట మైస‌మ్మ తదితర దేవతలను శక్తికి ప్రతీకగా, సరస్వతి, లక్ష్మిలను చదువు, సంపదకు గుర్తులుగా పూజిస్తాం.. కానీ దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తి ని నిర్ల‌క్ష్యంగా చూడ‌డం, వారికి స‌రైన గౌర‌వ మ‌ర్యాద‌లు ఇవ్వ‌క‌పోవ‌డం, ఎంత ఉన్న‌త స్థాయిలో ప‌ని చేసినా ఆడ‌దే క‌దా అని చిన్న‌చూపు చూడ‌డం ప‌రిపాటిగా మారింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 113వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

స‌మాజంలో ఇప్పుడిప్పుడు ఉద్యోగరంగంలో స్త్రీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం క‌న‌బ‌డుతోంది. 50 మందికి మించి ఉద్యోగులు ఉన్న సంస్థల బోర్డులో కనీసం 40 శాతం మంది మహిళా సభ్యులుండాలని ఇప్పటికే ఓ నిబంధన ఉంది. ఇలాంటి నిబంధనల వల్లే world economic forum మహిళా సాధికారత అత్యుత్తమం అంటూ కితాబు ఇచ్చింది. అయితే, మ‌న దేశంలో మ‌హిళ‌ల‌కు అధికారికంగా స‌మాన హోదా ఇవ్వ‌డానికి రూపొందించిన బిల్లుకు ఆమోద‌ముద్ర అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. పార్లమెంటులో మూడోవంతు రిజర్వేషన్ కోసం రూపొందిన బిల్లు దాదాపు 20 ఏళ్లుగా దుమ్ముకొట్టుకుని ఉంది. ఇక సమాన ఉద్యోగాలు, వేతనాలు గురించి ఏమని చెప్పుకోగలం.

ఇక‌పోతే అసంఘ‌టిత‌రంగం, సంఘ‌టిత రంగాల్లో ఇప్పటికీ కూడా మహిళలు స‌హ‌చ‌రుల‌తో అనేక ర‌కాలుగా స‌ఫ‌ర‌వుతూనే ఉన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశం లో లేదంటే ఇతర ఏ ప్రదేశాల్లో కూడా వాళ్ళని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం చేస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటిని ఆపడం ఇప్పుడు చాలా ముఖ్యం.

క్యాలెండ‌ర్‌లో తేదీలు, సంవ‌త్స‌రాలు ఏడాదికేడాది మారుతూనే ఉంటున్నాయి. దీనితోపాటు మ‌హిళ‌ల మొక్క స‌క్సెస్ రేటు వారి విజ‌యాలు కూడా పెరుగుతూనే వ‌స్తున్నాయి. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా కేవలం మహిళల‌ యొక్క విజయాలని గుర్తించడమే కాకుండా వాళ్ళని ఎల్ల‌వేళ‌లా అభినందిస్తూనే ఉండాలి. దీనితో మహిళలు అట్టడుగునే ఉన్నారు అని కాకుండా వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా అందరికీ తెలుస్తుంది.

మ‌రోవైపు ఆధునిక పోక‌డ‌లు, పాశ్చాత్య సంస్కృతి వెర‌సీ నేటి యువ‌తులు ప‌బ్ క‌ల్చ‌ర్ లో ప‌డి కొట్టుకుపోతున్నారు. మందేసి చిందేయ‌డ‌మే మ‌గువ‌కు అందం అనేంత‌గా మారిపోతున్నారు. న‌గ‌రీక‌ర‌ణ పేరుతో బాయ్ ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీలు, రేవ్ పార్టీలు అంటూ విచ్చ‌ల‌విడిగా తిరుగుతూ కొంద‌రు యువ‌తులు స్త్రీ జాతికే మాయ‌ని మ‌చ్చ‌గా మారుతున్నారు. ఈ విచ్చ‌ల‌విడి త‌నం కార‌ణంగా అసాధార‌ణంగా మ‌హిళ‌ల‌పై దాడులు, దౌర్జ‌న్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఆధునిక చైత‌న్యం ఎంతున్న సెల్ప్ డిఫెన్స్ చేయ‌లేక‌పోవ‌డం, ఏముందిలే అనుకుంటూ ముందుకు సాగడం వంటి ల‌క్ష‌ణాలు నేటి యువ‌తుల్లో ఎక్కువ క‌నిపిస్తున్నాయి. ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ, స‌ర‌దాగా కుమ్మైయి, నీతులు, హిత‌బోద‌లు మాకొద్దు అనే భావ‌న‌లో ఎక్కువ మంది క‌నిపిస్తుండ‌టం స‌దా శ్రేయ‌స్క‌రం కాదు. ఈ మాట‌లు ప‌క్క‌న‌పెడితే..

స‌మాజంలో మార్పు అనేది వ‌స్తేనే అంతా మంచి జ‌రుగుతుంది. ఆ మార్పు అనేది మన కుటుంబాల నుంచే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మూర్తులను గౌరవించాలి.. ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించాలి.. వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడాలి.. అప్పుడే సమాజం మారుతుంది.. ఇవేవీ చేయకుండా ఎవరిని నిందించినా ఫలితం ఉండదు..

ఇక‌పోతే…సామాజికంగానూ, రాజ‌కీయంగానూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.

చివరగా నాదో సందేహం? అసలు మహిళలకంటూ ఒక దినోత్సవం ఏమిటి? ఒక్క మార్చి 8వ తేదీనాడే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి.. ఈ ఒక్కరోజే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తే సరిపోతుందా?.. ప్రతి రోజూ మహిళల దినమే ఎందుకు జ‌రుపుకోకూడ‌దు..! ప్ర‌తి రోజు మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌ని ప్ర‌తి వ్య‌క్తికి న‌ర‌న‌రాన ఇంజెస్ట్ చేయాల‌న్న‌దే నా అభిమతం.
– వాకిటి వెంక‌టేశం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌