కేసీఆర్ పాలిట్రిక్స్‌

0
448

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు, ఏమి చేసినా అది హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల‌ను వ‌దిలేసి, దేశ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్రంలో బీజేపీ పాల‌న‌ను, అందులో లోటుపాట్ల‌ను ఎండ‌గ‌ట్ట‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ యేత‌ర రాష్ట్రాల్లో తిరుగుతూ, బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న అన్ని శ‌క్తుల్ని ఏక‌తాటిపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అవ‌కాశం ఉన్న ప్ర‌తిసారి కేసీఆర్‌ బీజేపీని, కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు.

దేశంలో బీజేపీ వ్య‌తిరేక కూట‌మిని త‌యారు చేసేందుకు శ‌క్తిమించి ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బీహార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌నేది తేట‌తేల్లంది. ఈ బీహార్ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ స్వామి కార్యంతోపాటు స్వ‌కార్యం తీర్చిదిద్దుకునే ప‌ని ఉన్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. గాల్వాన్ లోయ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్‌కు చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయ‌డం స్వామి కార్య‌మైతే, కేంద్రంలోని బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మిని బ‌లోపేతం చేయ‌డం స్వ‌కార్యమ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

సైనిక కుటుంబాలతో పాటు కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌ల‌తో క‌లిసి ఈ స్వామి కార్యాన్ని ఎట్ట‌కేల‌కే కేసీఆర్‌ గ‌ట్టెక్కించారు. ఇంత వ‌ర‌కు బాగానే వుంది. కానీ, బీహార్‌లో ఆర్థిక సాయం ప‌నులు పూర్తి చేసుకుని, కేసీఆర్ మీడియా ముందుకు వ‌చ్చిన త‌ర్వాతే క‌థ మారిపోయింది. బీహార్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అదే ప‌నిగా కేంద్రంపై ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. కేసీఆర్ మాట తీరు న‌చ్చ‌క‌నో, లేక ఆ మాట‌ల్లో సారాంశం న‌చ్చ‌క‌నో బీహార్ సీఎం నితీష్ మీడియా స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడుతుండ‌గానే, అక్క‌డి నుంచి వెళ్లిపోయే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప్ర‌య‌త్నాన్ని కేసీఆర్‌ వ‌రించారు . నితీష్ ని కూర్చోమ‌ని ప‌దే ప‌దే చెప్పిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. సీఎం నితీష్ నిల‌బ‌డే ఉండిపోయారు. ఇక చేసేదేమీ లేక కేసీఆర్‌, ఇక రాజ‌కీయాలు మాట్లాడ‌ను కుర్చోండి అంటూ చెప్ప‌డంతో కూర్చుండిపోయారు నితీష్‌. ఈ తతంగ‌మంతా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. తాను ఒక‌టి త‌లుస్తే… దైవం మ‌రొక‌టి త‌లుస్తుందంటే ఇదేనేమో.

అయితే, ఈ స‌న్నివేశాన్ని బీజేపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఒక ద‌శ‌లో బీహార్ ప్రెస్ మీట్ వీడియోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసింది. బీజేపీ సోష‌ల్ మీడియా వింగ్‌లు ఈ ప‌నిలో ఉన్నాయ‌న‌డం అతిశ‌యోక్తి కాక‌పోవ‌చ్చు. మ‌రోవైపు సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ఫై బిజెపి ఎంపీ లక్ష్మణ్‌ కామెంట్స్ చేశారు. కేసీఆర్ బీహార్ ప‌ర్య‌ట‌న అభాసుపాలైంద‌న్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యల ద్వారా మరోసారి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య బంధం బహిర్గతమైంద‌ని చెప్పుకొచ్చారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులతో ఎమర్జెన్సీ త‌ల‌పించేలా పాల‌న కొన‌సాగిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ధాన్యం కుప్పల మీద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని సీఎం కేసీఆర్‌.. బీహార్ కు వెళ్లి అక్కడి వారికి చెక్కులు ఇవ్వమేంటి?. కన్న తండ్రికి బువ్వపెట్టని కొడుకు.. మేనమామకు మంగళ హారతి పట్టిన చందంగా కేసీఆర్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఏదేమైనా కేసీఆర్‌ ప్ర‌తిప‌క్షాల‌కు ఈ విధంగా విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశాన్ని ఎందుకు క‌ల్పించారనేది కోటి డాల‌ర్ల ప్ర‌శ్న‌.

కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో పంజాబ్ రైతులు నిర‌స‌న‌కు దిగితే వారికి మ‌ద్ద‌తు తెలిపిన కేసీఆర్‌, అంత‌టితో ఆగ‌కుండా బీజేపీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపి చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు సైతం ల‌క్షలాది రూపాయ‌ల‌ను చెక్కు రూపంలో అందివ్వ‌డం ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల‌కు తావించింది. ప్ర‌తిప‌క్షాలు నిల‌దీసేందుకు అవ‌కాశ‌మిచ్చింది. అది మ‌ర‌క‌ముందే అలాంటి విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం బీహార్ ప‌ర్య‌ట‌న‌ను కేసీఆర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నార‌నేది ఆయ‌న అంత‌రాత్మ‌కే తెలియాలి.

ఇక‌పోతే మిగులు బ‌డ్జెట్‌గా ఉన్న తెలంగాణ బ‌డ్జెట్ ని కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల‌ లోటు బ‌డ్జెట్‌గా మార్చార‌ని విప‌క్షాలు ఇప్ప‌టికే కోడై కూస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ఈ విష‌యాన్నినొక్కివ‌క్క‌ణించారు. ఇప్ప‌టికే అప్పుల కూబిలో కూరుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని బ‌య‌ట‌ప‌డేయ‌టంపై దృష్టి పెట్ట‌క‌పోగా, మ‌రింత అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయ‌డం వెనుక దాగున్న అంత‌ర్యం ఏమిటో అర్థం కాని మాయ‌జాలంగా వుంది.

బీజేపీని వ్య‌తిరేకించాలి. బీజేపీ చ‌ర్య‌ల‌ను ప్ర‌తిఘ‌టించాలి. బీజేపీకి వ్య‌తిరేకంగా అన్ని శ‌క్తుల్ని కూడ‌గ‌ట్టాలి. కూట‌మిని బ‌లోపేతం చేయాలి. ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి. కానీ, ఈ త‌తంగంలో మ‌నుగ‌డ‌ను కోల్పోయే ప‌నుల‌కు దిగ‌డం, వ్య‌క్తిత్వాన్ని తాక‌ట్టుపెట్ట‌డం, న‌మ్ముకున్న వారిని న‌ట్టేటిలో వ‌దిలేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం. న‌మ్ముకున్న వారి కోసం ఎంత వ‌ర‌కైనా వెళ్లి కొట్ట‌డం, పోట్ల‌డ్డం తెలంగాణ వారికి ఎవ‌రూ నేర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని విద్య‌. మన శ‌క్తియూక్తుల‌కు ప‌దునుపెట్ట‌కుండా, ప‌క్క రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డం క‌లిసి వ‌స్తోందా ? ఉన్నది లేన‌ట్లుగా క‌నిపిస్తుందా ? ఏదేమైనా , తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీహార్ ప‌ర్య‌ట‌న లాభం కంటే న‌ష్ట‌మే మిగిల్చింద‌న‌డం అతిశ‌యోక్తి కాదేమో.

– వాకిటి వెంక‌టేశం