తెలంగాణ‌లో ముందస్తు ముచ్చ‌ట లేన‌ట్లే ?!

0
338

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే, రాష్ట్రంలో రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చి, ఎనిమిదేళ్ల పాటు తిరుగులేని పార్టీగా అవ‌త‌రించిన టీఆర్ఎస్ కు గ‌డ్డుకాలం ఎదుర‌వుతోంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గానికి అతి త్వ‌ర‌లో ఉప ఎన్నిక రానున్నాయి. తెలంగాణ‌లో అధికారాన్ని చేప‌డుతామ‌ని ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చిన బీజేపీకి ఇప్పుడు మునుగోడులో గెలుపు అనివార్యమైంది. ఇందుకోసం ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల రాజీనామాకు దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని బీజేపీ త‌న వైపు తిప్పుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబ‌ట్టి గెలుపు త‌మ‌దే అనే ధీమాలో బీజేపీలో వుంది.

మునుగోడులో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రాజీనామాతో తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి. అధికార పార్టీతోపాటు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ సైతం గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. త‌మ ప్ర‌త్య‌ర్ధిని చిత్తు చేసేందుకు వ్యూహ‌ర‌చ‌న‌లు మొద‌లుపెట్టాయి. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం అయినప్పటికీ ఈ సీటు టీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముఖ్యంగా దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీ తరఫున రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ విజయం తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ వేగంగా విస్తరిస్తోందని, టీఆర్‌ఎస్‌ రోజు రోజుకు తగ్గుతోందని కాషాయ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే, అటు దుబ్బాక‌లోనూ, ఇటు హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపును అడ్డుకోలేక‌పోయిన టీఆర్ఎస్ నాయ‌కులు ఈసారి మాత్రం బీజేపీ గెలుపును ఖ‌చ్చితంగా అడ్డుకుని తీరుతామ‌నే ధీమాలో ఉన్నారు.

అయితే, ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీ ర‌హ‌స్యంగా త‌న శ‌క్తియుక్తుల‌తో రాష్ట్రంలో ప‌లు స‌ర్వేలు చేయించుకుంది. రాష్ట్రంలోని ఏ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ ప‌రిస్థితి ఏమిటీ ? ఇప్ప‌టికిప్పుడు రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌స్తే, ఏ ఏ స్థానాల్లో గెలుపు, ఏ ఏ స్థానాల్లో ఓట‌మి జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌నే కోణంలో ఈ స‌ర్వేలు సాగిన‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు రాజ‌కీయ చాణ‌క్యుడు ప్ర‌శాంత్ కిషోర్ సైతం త‌మ టీమ్‌తో తెలంగాణ వ్యాప్తంగా స‌ర్వే చేసి, టీఆర్ఎస్ గెలుపు కోసం త‌న వంతు సాయం చేస్తాన‌ని మాటిచ్చారు. ఆ దిశ‌గా కొంత కాలం ప‌ని చేశారు కూడా. ఆ త‌ర్వాత వేగంగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌ధ్యంలో ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తుతానికి టీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నార‌నేది స‌మాచారం.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం బ‌లంగా లేక‌పోవ‌డం, ప్ర‌తిప‌క్షంలో నాయ‌క‌త్వలోపం ఉండ‌టం, సీనియ‌ర్ల‌కు జూనియ‌ర్ల‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం ఉండ‌టం అధికార పార్టీకి బాగా క‌లిసొచ్చింది. ఆడింటే ఆట‌గా పాడిందే పాట‌గా సాగిచ్చుకుంది. గ‌డిచిన ఎనిమిదేళ్లుగా ఈ తంతు కొన‌సాగింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు మిన్న‌కుండిన బీజేపీ ఇప్పుడు మాత్రం ఒంటికాలుపై లేస్తోంది. ముచ్చ‌ట‌గా మూడు సీట్ల‌తో అలరారుతున్న బీజేపీ ఏకంగా అధికార పీఠానికే గురిపెట్టింది. కొడితే ఏనుగు కుంభ‌స్థ‌లాన్ని కొట్టాల‌నుకుంటోంది. ఇది సాధ్య‌మేనా, బీజేపీని తెలంగాణ‌ ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తారా ? అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.

తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్వేల్లోనూ బీజేపీ బలం పుంజుకుందని, 30 నుంచి 40 శాతం వరకు ఓట్లు సాధిస్తుందని ఆయా స‌ర్వేల ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాయి. అధికార పార్టీ చేష్ట‌ల‌తో విసిగివేసారిన‌ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని ఈ స‌ర్వేల వ‌ల్ల తేట‌తెల్ల‌మైంది. ఈ పరిస్థితుల్లో మునుగోడులోనూ బీజేపీ గెలిస్తే, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప‌త‌నం మొద‌లైంద‌ని ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ఉధృతం చేస్తారన్న భయం కేసీఆర్‌కు పట్టుకుంది.

అందుకే మొన్నటి వరకు మోదీ సర్కారుతో అల‌మ్‌బ‌ల‌మ్ తీసుకున్న‌కేసీఆర్ స‌ర్కార్‌ ఇప్పుడు కేంద్రంపై సమరశంఖం పూరించారు. ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు అభ్యర్థులకు మద్దతు పలికిన కేసీఆర్‌ తాజాగా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించి కేంద్రంపై ధిక్కార స్వరాన్ని వినిపించారు. అదే సందర్భంలో విభజన రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ బీజేపీపై విరుచుకుప‌డ్డారు. జాతిపిత మహాత్మాగాంధీని సైతం మోదీ సర్కారు అవమానించింద‌ని, స్వాతంత్ర‌ పోరాటానికి నేతృత్వం వహించిన జాతిపిత‌ను గుర్తించకపోవడం ఏ దేశంలోనూ లేదంటూ కేసీఆర్ కేంద్రంపై త‌నదైన శైలిలో మాట‌ల దాడి కొన‌సాగించారు.

మరోవైపు గత ఎనిమిదేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని విపక్ష నేతలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కాళేశ్వ‌రం పేరుతో నిధుల‌ను అమాంతం బొక్కేసారనే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఒక‌ద‌శ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకున్నార‌నే మాట‌లు కూడా వినిపించాయి. మిగులు బ‌డ్జెట్‌గా ఉన్న తెలంగాణ‌ను కేసీఆర్ లోటు బ‌డ్జెట్ తెలంగాణ‌గా మార్చార‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారి అప్పుల అంశాన్నే నొక్కి వ‌క్కాణిస్తున్నారు.

ఏదేమైనా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వేగంగామార్పులు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ సీటు నిల‌బెట్టుకోవ‌డం పార్టీపై త‌న ప‌ట్టును హైక‌మాండ్ కు చూపించుకోవ‌డం కాంగ్రెస్ పార్టీలో తాజాగా ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డికి అనివార్య‌మైంది. త‌న స‌త్తాను చాటుకోవ‌డానికి ఏడాదిన్న‌ర ముందే వ‌చ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని, త‌న‌పై ఉన్న కొద్దిగొప్ప అసంతృప్తుల‌ను కూడా మాయం చేయాల‌నే త‌ప‌న తాప‌త్రాయంతో రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. అదే స్థాయిలో గ్రామ‌గ్రామానికి కార్య‌క‌ర్త‌లను, నాయ‌కుల‌ను పంపి, ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పాదాభినంద‌న‌లు చేయిస్తున్నారు.

తెలంగాణ‌ న‌డిబొడ్డులో జెండా పాత‌డ‌మే ల‌క్ష్యంగా కాషాయ నేత‌లు వేగంగా దూసుకొస్తున్నారు. ఇందుకు ఆ పార్టీ అధిష్టానం కూడా 100 శాతం మ‌ద్ద‌తు ఇస్తోంది. పిలువ‌కుండానే కేంద్రం నుంచి పెద్ద పెద్ద నాయ‌కులు వ‌చ్చి, స‌భ‌లు, స‌మావేశాలు పెట్టి వెళ్లిపోతున్నారు. తెలంగాణ‌లో బీజేపీ వేవ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీట్ల‌కే ప‌రిమిత‌మైన బీజేపీ ఒక్క‌సారిగా 80కిపైగా సీట్ల‌ను సాధించి తీరుతామ‌నే ధీమాని వ్య‌క్తం చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌జా సంగ్రామ‌యాత్ర పేరుతో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇప్ప‌టికే రెండు విడ‌త‌లు పూర్తి చేసుకుని, మూడో విడ‌త కొన‌సాగిస్తోంది. 1000 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర ల‌క్ష్యాన్ని కూడా బండి సంజ‌య్ చేరుకుని సెల‌బ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు తెలంగాణాలో ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు బీజేపీ నేత‌లు.

టీఆర్‌ఎస్‌ బహిష్కరించడంతో కాషాయ కండువా కప్పుకున్న తెలంగాణ ఉద్యమ నేత ఈటల రాజేందర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ.. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులను బీజేపీ వైపు ఆకర్షించేట్లు చేస్తున్నారు. అదే సందర్భంలో అధికారానికి చాలా కాలంగా దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలోనూ రేవంత్‌రెడ్డిపై కోపంతో రగిలిపోతున్న నాయకులకు కాషాయ కండువా కప్పుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన కీలక నాయకులను కాషాయ దళంలో చేర్చుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టాలని బీజేపీ హైక‌మాండ్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

తెలంగాణ‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లు, జ‌రుగ‌బోతున్న మునుగోడు ఉప ఎన్నిక నేప‌ధ్యంలో అధికార పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఎంత ఖ‌ర్చు పెట్టిన కానీ, గెలుపోట‌ముల‌ను మార్చ‌లేక‌పోయింది టీఆర్ఎస్‌. ఉప ఎన్నిక‌లో ఓడిపోతే, తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌జ‌ల విశ్వాసాన్ని మ‌రింత కోల్పోతామ‌నే భ‌యం ఒక‌వైపు, తెలంగాణ ప్ర‌జ‌లకు ఇది వ‌ర‌క‌టిలా టీఆర్ ఎస్ పార్టీపై సెంటిమెంట్ లేక‌పోవ‌డం మ‌రోవైపు కేసీఆర్ కృత‌నిశ్చ‌యాన్ని క్వ‌శ్చ‌న్ చేస్తున్నాయి. ఈ త‌రుణంలో కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసి, ముంద‌స్తుకు వెళ‌తార‌నే రాజ‌కీయ విశ్లేష‌కుల ఊహ‌గానాల‌కు బ్రేకులు ప‌డిన‌ట్లే అయ్యింది.

వ్యాస‌క‌ర్త‌- వాకిటి వెంక‌టేశం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్