పార్లమెంటులోనే శివసేన ఎంపీ బెదిరింపులు..

0
623

న్యూఢిల్లీ : మహారాష్ట్ర వ్యవహారాలను లేవనెత్తినందుకు శివసేన ఎంపీ పార్లమెంటు సాక్షిగా బెదిరింపులకు పాల్పడ్డారని ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. ‘నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా! నిన్ను ఊచల వెనక్కి పంపిస్తా’ అని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పార్లమెంటు లాబీలోనే తనను బెదిరించినట్టు పేర్కొన్నారు. ఇది తనకే కాదు, యావత్ దేశంలోని మహిళలందరికీ అవమానమని, ఆయనపై కచ్చితంగా పోలీసు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా ఎన్నికైన నవనీత్ రాణా లోక్‌సభలో మహారాష్ట్రలోని పరిణామాలపై మాట్లాడారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరంపై తనపై బెదిరింపులు రావడంతో సోమవారం ఆమె లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలియజేశారు. తాజాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖ రాశారు. శివసేన ఎంపీపై దర్యాప్తు చేపట్టాలని అభ్యర్థించారు. అరవింద్ సావంత్ బెదిరింపులకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సాక్షి అని పేర్కొన్నారు.