రోహింగ్యాల క్యాంప్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 మంది మృతి

0
753

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది చ‌నిపోగా, 400 మంది జాడ తెలియ‌డం లేదు. ఈ క్యాంప్‌లో సుమారు ప‌ది ల‌క్ష‌ల‌ మంది రోహింగ్యాలు ఆశ్ర‌యం పొందుతున్నారు. వీళ్లంతా 2017లో మ‌య‌న్మార్ ఆర్మీ దాడి త‌ర్వాత ఆ దేశాన్ని వ‌దిలి వేరే దేశాల‌కు వ‌ల‌స వెళ్లిన వాళ్లే. బంగ్లాదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని కాక్స్ బ‌జార్ జిల్లాలో త‌ల‌దాచుకుంటున్నారు. సోమ‌వారం జ‌రిగిన ఈ అగ్నిప్ర‌మాదంతో ఇప్పుడు సుమారు 50 వేల మంది త‌మ తాత్కాలిక నివాసాల‌ను కోల్పోయారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని అటూఇటూ ప‌రుగెత్త‌డంతో ఎన్నో కుటుంబాలు చెల్లాచెదుర‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై బంగ్లాదేశ్ విచార‌ణ‌కు ఆదేశించింది. ఆ ప్రాంతంలోని మొత్తం 34 ఎక‌రాల్లో ఉన్న 8 క్యాంపుల్లో ఒక‌దాంట్లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు అధికారులు చెప్పారు.