పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

0
223

విజయవాడ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సైతం పాలిటెక్నిక్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిటెక్నిక్‌లలో చేరడానికి ఆసక్తి చూపే సప్లిమెంటరీ విద్యార్ధులు జులై 3వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ రుసుము చెల్లించి, సమీప హెల్ప్ లైన్ సెంటర్‌లో ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలసి ఉంటుందన్నారు. పాలిసెట్ కు హాజరై ర్యాంకులు పొందిన వారికి సీట్లు కేటాయించిన తదుపరి మిగిలిన సీట్ల అధారంగా వీరికి సీట్ల కేటాయింపు ఉంటుందని, అయితే సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారు సైతం పాలిసెట్ లో అర్హత సాధించి ఉండాలన్నారు. పూర్తి వివరాల కోసం https://appolycet.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు. వీరికి సంబంధించి వెబ్ కౌన్సెలింగ్‌లో ఎంపికలు, సీట్ల కేటాయింపు, అయా కళాశాలల్లో జాయిన్ కావటం, తరగతుల ప్రారంభం వంటి అంశాల షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామన్నారు. 2023 సంవత్సరంలో ఎస్‌ఎస్‌సి సప్లిమెంటరీ ఉత్తీర్ణులు అయినవారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రానున్న పది రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్ధులు, వారి తల్లి దండ్రులు సమీప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని సహాయ కేంద్రాలను నేరుగా సందర్శించి తమ పూర్తి సమాచారాన్ని వ్యక్తిగతంగా కూడా పొందవచ్చని చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.