వెంక‌య్య తో ఆత్మీయ స‌మ్మేళ‌నం

0
279

 

• 50 ఏళ్ళ ప్రజా జీవన సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అటెండర్ నుంచి ఐ. ఏ.ఎస్ అధికారి వరకూ సత్కారం
• సేవా భావంతో జీవితంలో ముందుకు సాగాలని పూర్వ సహచర బృందానికి సూచన
• జీవితంలో ఉన్నతి కొరకు అష్ట గుణాల ప్రాధాన్యతను తెలియజేసిన శ్రీ వెంకయ్యనాయుడు
• ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి, అభినందించిన పూర్వ ఉపరాష్ట్రపతి
• వెంకయ్యనాయుడు గారి జీవిత విశేషాలతో వెబ్ సైట్, యాప్ ఆవిష్కరణ

వార్తాలోకం ప్ర‌తినిధి, విశాఖ‌ప‌ట్నం, జూన్ 23 :

భారత పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు తనదైన శైలిలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. వారి 75వ జన్మదినోత్సవ సందర్భంలో… 50 ఏళ్ళ ప్రజా జీవన ప్రస్థానాన్ని పురస్కరించుకుని, గతంలో వారి దగ్గర వివిధ హోదాల్లో సేవలు అందించిన సహచర బృందంతో ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అటెండర్ నుంచి ఐ. ఏ.ఎస్ అధికారి వరకూ ప్రతి ఒక్కరినీ సత్కరించారు. విశాఖపట్నంలోని ఏ-1 కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి గతంలో వారి దగ్గర పని చేసిన వ్యక్తిగత సహాయకులు మొదలుకుని, ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి, పరిచయం చేసిన ముప్పవరపు వెంకయ్యనాయడు, ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ… 50 ఏళ్ళ నుంచి తమ సతీమణి శ్రీమతి ఉషమ్మ సహకారంతో పాటు… వివిధ హోదాల్లో తనతో కలిసిన పనిచేసిన సిబ్బంది సహకారం, అంకితభావమే తన విజయాలకు కారణమని ఆయన పేర్కొనటం విశేషం. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన ఎవరైనా సేవాభావంతో జీవితంలో ముందుకు సాగాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన తమ పూర్వ సిబ్బందికి అష్ట గుణాలను ఉద్బోధించారు. సమయపాలన, క్రమశిక్షణ, బృందస్ఫూర్తి, సేవాభావం, అంకితభావం, పరిపూర్ణ దృష్టి, నీతి, రీతి లాంటి ఎనిమిది గుణాలు జీవితంలో ఉన్నతిని అందిస్తాయని పేర్కొన్నారు. జీవితం మనల్ని ఏ మార్గంలో ముందుకు తీసుకుపోయినా సేవా భావాన్ని మాత్రం మరువకూడదని సూచించారు. ఈ సందర్భంగా వారందరికీ భారతీయ సంప్రదాయం ప్రకారం దుస్తులు పెట్టి, ఆశీర్వచనం అందించారు. అనంతరం తెలుగువారి సంప్రదాయ వంటకాలతో వారికి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి, అందరినీ పేరుపేరునా, ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వారి మనుముడు, మనుమరాళ్ళు కలిసి శ్రీ వెంకయ్యనాయుడు గారి జీవిత విశేషాలతో రూపకల్పన చేసిన యాప్, మరియు వెబ్ సైట్ ను ఆవిష్కరించి, పరిచయం చేశారు.

అంతకు ముందు కార్యక్రమంలో భాగంగా, కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ వెంకయ్యనాయుడు గారి ప్రియశిష్యునిగా సాగించిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారి దగ్గర పని చేస్తే, జీవితంలో ఏదైనా సాధించవచ్చని, ఆయన తర్ఫీదు అలా ఉంటుందని కొనియాడారు. తమ పిల్లలతో సమానంగా శ్రీ వెంకయ్యనాయుడు గారు, వారి సతీమణి శ్రీమతి ఉషమ్మ గారు అందించిన పుత్రవాత్సల్యం మరువలేనిదని, తనకు ఆరోగ్యం బాగాలేని సందర్భంలో వారు అండగా ఉన్న తీరును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

జీవితంలో 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న అమృతోత్సవ సందర్భంలో గుర్తు పెట్టుకుని మరీ శ్రీ వెంకయ్యనాయుడు గారు వ్యక్తిగత సిబ్బంది మొదలుకుని, ఉన్నత అధికారుల వరకూ అందరినీ పిలిచి, కుటుంబ సభ్యుల్లా ఆదరించి అభినందించటం పట్ల వారి వద్ద గతంలో పని చేసిన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వారి ప్రేరణతో సేవా భావాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి  సత్యకుమార్, ఐ.ఏ.ఎస్ అధికారులు  ఐ.విసుబ్బారావు, రజత్ భార్గవ్, కృష్ణ కిశోర్, సురేష్, యువరాజ్, ప్రశాంత్ కుమార్ రెడ్డి, రాజ్యసభలో సేవలు అందించిన రామాచార్యులు, ఏ.ఏ.రావు సహా… పలువురు ప్రభుత్వ అధికారులు,  వెంకయ్యనాయుడు గారి పూర్వ వ్యక్తిగత సిబ్బంది, ప్రస్తుత వ్యక్తిగత సిబ్బంది,  నాయుడు గారి కుటుంబ సభ్యలు తదితరులు పాల్గొన్నారు.