ఠాక్రే..! గద్దె దిగు

0
473

దద్దరిల్లిన లోక్‌సభ.. సుప్రీంకెక్కిన మాజీ సీపీ
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రం కుట్ర: సేన
దేశ్‌ముఖ్‌ రాజీనామా ప్రశ్నే లేదు : పవార్‌

న్యూఢిల్లీ, మార్చి 22: మహారాష్ట్ర పరిణామాలు అటు రాష్ట్రంలోనే కాక ఢిల్లీలోనూ ప్రకంపనలు రేపాయి. బార్లు, రెస్టారెంట్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీస్‌ బాసులకు టార్గెట్‌ ఇవ్వడంపై లోక్‌సభ దద్దరిల్లింది. దేశ్‌ముఖ్‌ను తక్షణం బర్తరఫ్‌ చేయాలని, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. మచ్చపడి, 16 సంవత్సరాల పాటు సస్పెన్షన్‌లో ఉన్న ఓ పోలీస్‌ అధికారిని (సచిన్‌ వాజేను) తిరిగి ఎందుకు విధుల్లోకి తీసుకున్నారు? ఆయనను సీఎం ఎందుకు ప్రెస్‌మీట్‌లో వెనకేసుకొచ్చారు?’’ అని బీజేపీ సభ్యుడు మనోజ్‌ కొటక్‌ ప్రశ్నించారు. అయితే ఈ దాడిని శివసేన తిప్పికొట్టింది. ‘‘ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు గత 14నెలలుగా కేంద్రం చేయని ప్రయత్నం లేదు. ఆరోపణలు చేసిన పోలీస్‌ మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ అత్యంత అవినీతిపరుడు’’ అని సేన ఎంపీ వినాయక్‌ రౌత్‌ ఎదురుదాడి చేశారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై పోలీస్‌ కమిషనర్‌ చేసిన ఆరోపణలను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తోసిపుచ్చారు. ‘‘కొవిడ్‌ సోకి దేశ్‌ముఖ్‌ ఫిబ్రవరి 5 నుంచి 15 దాకా నాగ్‌పూర్‌లోనే ఆసుపత్రిలోనే ఉన్నారు. పాజిటివ్‌ అని తేలడంతో 27వ తేదీ దాకా ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఫిబ్రవరి 15 ప్రాంతంలో తనను దేశ్‌ముఖ్‌ పిలిపించారన్న పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపణలో నిజం లేదు. మూడు వారాల పాటు ఆయన ముంబైలోనే లేరు. నాగ్‌పూర్‌లోనే ఉన్నారు. అలాంటి వ్యక్తి ముంబైలోని తన నివాసానికి సీపీని ఎలా పిలిపిస్తారు? అంచేత ఇదంతా అబద్ధం. దేశ్‌ముఖ్‌ రాజీనామా చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు’’ అని పవార్‌ సోమవారం స్పష్టం చేశారు. మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఓ అక్రమాల గని అనీ, ఆయన అవినీతిపై నిష్పక్షపాతంగా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఓ పిటిషన్‌ వేశారు. సీపీగా పనిచేసిన పరమ్‌బీర్‌ సింగ్‌ పెద్ద అవినీతిపరుడంటూ ఓ మాజీ పోలీస్‌ అధికారి ఆరోపించడం తాజాగా చర్చనీయాంశమయ్యింది. ‘‘గమ్‌దేవీ పోలీస్‌ ఠాణాలో నేను పనిచేస్తున్న సమయంలో సస్పెండయ్యాను. అప్పట్లో ఆయన ఏసీబీ ఛీఫ్‌గా ఉన్నారు. నన్ను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రూ.2 కోట్ల లంచం డిమాండ్‌ చేశారు.’’ అని సీఐ అనుదీప్‌ డాంగే వెల్లడించారు. దీనిపై మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శికి ఫిర్యాదు చేశానన్నారు. ఒక అధికారి చేసిన ఆరోపణల వల్ల పూర్తి మెజారిటీ ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలదని శివసేన వ్యాఖ్యానించింది. ‘‘ఇదంతా ఓ కుట్ర. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగిజారిందన్న నెపంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర పన్నింది.’’ అని శివసేన తన పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో పేర్కొంది. వ్యాపారవేత్త మన్‌సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద మృతి కేసును పరిష్కరించినట్లు ముంబై ఉగ్రవాద నిరోధక విభాగం ప్రకటించింది. విశేషమేమంటే ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించిన 24 గంటల్లోపలే ఏటీఎస్‌ ఈ ప్రకటన చేయడం విశేషం.