పోచారం మున్సిపాలిటీలో సీసీ కెమెరాల కుంభకోణం?

0
327
  • రాజీవ్‌ గృహకల్పలో సీసీ కెమెరాల ఫిట్టింగ్‌పై సీతకన్ను
  • సీసీ కెమెరాల ఫిట్టింగ్‌ కోసం ప్రతీసారి పిట్ట కథలు
  • చేతులు తడపనిదే కదలని ఫైల్స్‌

పోచారం మున్సిపాలిటీ అవినీతికథలు -1

(వార్తాలోకం ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌, డిసెంబర్‌ 26)
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ కమిషనర్ నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పిందే చట్టం చేసిందే శాసనం అనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలకు సరైన సమాధానం కూడా చెప్పరనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే మున్సిపాలిటీ పెద్దసార్‌కు పేద ప్రజలు ఏమీ ఇచ్చుకోలేరు కదా.. అందుకే వాళ్లతో అంటీముట్టనట్లుగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందులో మొదటిది సీసీ కెమెరాలు. రాజీవ్ గృహకల్ప లో సీసీ కెమెరాలు లేవని వాటిని ఏర్పాటు చేయాలని పలువురు పలు సందర్భాల్లో అడుగుతూనే ఉన్నారు. కానీ ఆ పెద్ద సార్‌కు మాత్రం అదిగో ఇదిగో అంటూ మాట దాట వేస్తూ వస్తున్నారు. అసలు ఇందులో ఉండే మతలబు ఏమిటో ఆయనకే తెలియాలి.

పోచారం మున్సిపాలిటీ..అసలే సిటీ శివారు ప్రాంతం దొంగతనాలు, దోపిడీలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. పోచారం మున్సిపాలిటీ పెద్దసారా, పోలీసులా లేక పోచారం మున్సిపాలిటీ అధికారులా ఎవరు సమాధానం చెబుతున్నారు. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారంటే క్వశ్చన్‌ మార్కే. ఒకవేళ దొంగతనం జరిగితే, ఎత్తుకెళ్లిన సొత్తు రికవరీ అవుతుందా అంటే అనుమానమే. అసలు సీసీ కెమెరాలు పెట్టాలని, పేదలకు రక్షణ కల్పించాలనే ఆలోచన కనిపించడం లేదు. కాసుల పై ఉన్న శ్రద్ద, సీసీ కెమెరాలు అమర్చడంపై లేకపోవడంతో పలువురు ప్రశ్నిస్తున్నారు.బైక్ దొంగతనాలు, వాహనాల్లో పెట్రోల్ మాయం కావడం, స్పేర్ పార్ట్స్ కనిపించకుండా పోవడం ఇక్కడ సర్వసాదారణం. ఈ విషయంపై మున్సిపాలిటీ పెద్దలను అడిగితే.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయమంటారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పెద్దసారును అడిగితే కూడా చెప్పే మాటలు చాలా వింతగా, గమ్మత్తుగా ఉంటాయి. అవి అర్థమయినట్టే ఉంటాయి. కానీ ఎవరికీ అర్థం కావు. వారు చెప్పే మాటలు వింటే నవ్వి పోదురు కదా నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంటుంది. వారి వ్యవహారశైలి ఆఫీస్ కి వచ్చిన వారి పట్ల వ్యవహరించే తీరు చిత్ర విచిత్రంగా ఉంటుందనేది పబ్లిక్‌టాక్‌.

అధికారం చేతిలో ఉంది.కదా అని సామాన్యులకు కనీస మర్యాద కూడా ఇవ్వరంటా.. ప్రజల కోసం పనిచేసే అధికారి అదే ప్రజల పట్ల ఇలాగేనా వ్యవహరించేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పెద్దసార్‌ కి చేయి తడపనిదే ఏ పని చేయారనేది జగమెరిగిన సత్యమనేది అందరి నోట్లో నానుతోంది. అందుకే ఎవరైనా పోచారం మున్సిపాలిటీ ఆఫీస్ కి వెళితే గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వచ్చిన వారు ఏమీ ఇచ్చుకోలేరు కదా. వాళ్ళతో నా కేంటి పని అన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ పెద్ద సార్‌ పని తీరు మార్చుకోవాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

(రేపు పోచారం మున్సిపాలిటీ అవినీతి కథలు-2)