మరోసారి ధరలను పెంచనున్న మారుతీ సుజుకి

0
513

ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్టు దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తెలిపింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా కంపెనీపై ప్రతికూల ప్రభావంతో ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ‘గతేడాది వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరగడంతో వాహనాల ధరలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని వినియోగదారులపై వేస్తున్నట్టు’ పేర్కొంది. ఈ ధరల పెరుగుదల వేర్వేరు మోడళ్లకు మారుతుందని తెలిపింది. అయితే, ఈ ధరల శ్రేణి ఎంత మొత్తంలో ఉంటుందనేది స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఈ ఏడాది ప్రారంభం జనవరిలో కంపెనీ వాహనాల ధరలు పెంచిన సగతి తెలిసిందే. అప్పుడు మోడల్, వేరియంట్‌ని బట్టి రూ. 34 వేల వరకు పెంచింది. ఇక, ఫిబ్రవరిలో మారుతీ సుజుకి 1,68,180 వాహనాలను ఉత్పత్తి చేసింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 1,40,933 వాహనాల ఉత్పత్తి కంటే అధికం. అమ్మకాల పరంగా, కంపెనీ ఫిబ్రవరిలో 1,64,469 యూనిట్లను విక్రయించగా, ఇది గతేడాదితో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. అయితే, 2020-21లో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య అమ్మకాలు 12.8 శాతం క్షీణించాయని కంపెనీ వెల్లడించింది.