గతాన్ని వీడి భారత్‌-పాకిస్తాన్‌ ఏకం కావాలి : జనరల్‌ బజ్వా

0
1231

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా ఉపఖండంలో శాంతి స్థాపన కోసం శాంతి ప్రవచనాలు వల్లించారు. భారతదేశం-పాకిస్తాన్‌ రెండూ గతాన్ని పాతిపెట్టి ఐక్యంగా ముందుకు సాగవలసిన సమయం వచ్చిందని బజ్వా అన్నారు. తూర్పు, పశ్చిమ ఆసియా మధ్య కనెక్టివిటీని నిర్ధారించడం ద్వారా దక్షిణ, మధ్య ఆసియా సామర్ధ్యాన్ని అన్‌లాక్‌ చేయడానికి స్థిరమైన ఇండో-పాక్‌ సంబంధాలు కీలకమని ఆయన చెప్పారు. ‘కశ్మీర్ సమస్య వివాదాల హృదయాల్లో అలాగే ఉంది. శాంతియుత మార్గాల ద్వారా కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించకుండా, రాజకీయంగా ప్రేరేపించబడిన ఘర్షణ కారణంగా ఉపఖండాంతర సమ్మతి ప్రక్రియ ఎల్లప్పుడూ పట్టాలు తప్పే అవకాశం ఉన్నదని అర్థం చేసుకోవాలి’ అని బజ్వా అన్నారు. పొరుగు దేశం వారు ఆక్రమిత కశ్మీర్‌లో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

భీభత్సం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్తాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ గత నెలలో స్పష్టం చేసింది. భీభత్సం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించే బాధ్యత పాకిస్థాన్‌పై ఉన్నదని కూడా భారత్ తెలిపింది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్.. శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించినప్పుడు.. శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని, అయితే సంబంధాలను సాధారణీకరించడానికి భారతదేశం తొలి అడుగు వేయవలసి ఉంటుందని చెప్పిన నేపథ్యంలో బజ్వా వ్యాఖ్యలు చేయడం విశేషం. వివిధ శక్తుల కేంద్రాల మధ్య విచ్చలవిడి సంబంధాలు చివరికి మరొక ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తాయని, దక్షిణ ఆసియాలో ఈ పరిష్కరించని సమస్యలే మొత్తం ప్రాంతాన్ని తిరిగి పేదరికం, అభివృద్ధి చెందని స్థితిలోకి లాగుతున్నాయని జనరల్‌ బజ్వా అన్నారు.