ప్ర‌పంచ మీడియా ముందే.. అమెరికా, చైనా వాగ్వాదం

0
504

అల‌స్కా: అమెరికా, చైనా ఉన్న‌తాధికారులు ఒక‌రిపై ఒక‌రు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకున్నారు. అల‌స్కాలో జ‌రుగుతున్న భేటీలో రెండు దేశాల అధికారులు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చైనా వైఖ‌రి స‌రిగా లేద‌ని బైడెన్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. అయితే త‌మ‌పై దాడి చేసేందుకు కొన్ని దేశాల‌ను ఉసిగొల్పుతున్న‌ట్లు అమెరికాపై చైనా ఆరోప‌ణ చేసింది. రెండు సూప‌ర్ ప‌వ‌ర్ దేశాల మ‌ధ్య గ‌త కొన్నాళ్ల నుంచి సంబంధాలు బ‌ల‌హీనంగా ఉన్న విష‌యం తెలిసిందే. జింగ్‌జాంగ్‌లో ఉలిగ‌ర్ ముస్లింల ప‌ట్ల చైనా ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును అమెరికా ఖండించింది. అనేక వివాదాస్ప‌ద అంశాల‌ను కూడా అమెరికా అధికారులు ఆ భేటీలో లేవ‌నెత్తారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జేక్ సులివ‌న్‌లు.. చైనా అధికారుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. చైనా త‌ర‌పున ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ, విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి యాంగ్ జిలేచిలు మాట్లాడారు.

చైనా వ్య‌వ‌హార శైలి ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నామ‌ని, జింగ్‌జియాంగ్‌, హాంగ్ కాంగ్‌, తైవాన్ లో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ద‌ని, అమెరికాపై సైబ‌ర్ దాడులు చేస్తుంద‌ని, మిత్ర దేశాల‌పై ఆర్థిక చ‌ర్య‌ల‌కు దిగుతున్న‌ట్లు అమెరికా మంత్రి బ్లింకెన్ ఆరోపించారు. ప్ర‌పంచ సుస్థిర‌త‌ను చైనా చ‌ర్య‌లు దెబ్బ‌తీస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. చైనా కూడా ఘాటు రీతిలో అమెరికాకు స‌మాధానం ఇచ్చింది. అమెరికా ప్ర‌తి చోటా సైనిక చ‌ర్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు యాంగ్ ఆరోపించారు. ఇత‌ర దేశాల ఆధిప‌త్యాన్ని అమెరికా అణ‌గ‌దొక్కుతోంద‌న్నారు. దేశాల మ‌ధ్య వాణిజ్య బంధాల‌ను అమెరికా చెరిపేస్తోంద‌ని, కొన్ని దేశాల‌ను త‌మ‌పై ఉసిగొల్పుతోంద‌ని చైనా మంత్రి ఆరోపించారు. అమెరికాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న అధికంగా ఉంద‌ని, న‌ల్ల‌జాతీయుల‌ను హింసిస్తున్నారంటూ ఆయ‌న పేర్కొన్నారు. దాదాపు గంట సేపు రెండు దేశాల ప్ర‌తినిధులు ప్ర‌పంచ మీడియా ముందే ఒక‌రిపై ఒక‌రు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకున్నారు.