అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి

0
1296

న్యూ ఢిల్లీ: తెలంగాణలోని మల్కాజిగిరి దేశంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా రికార్డు సృష్టించింది. అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేసిన స్థానంగా నిజామాబాద్‌ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. అత్యధిక నోటా ఓట్లు (47,977) నమోదైన లోక్‌సభ నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు రెండో స్థానాన్ని దక్కించుకొంది. దేశంలో అత్యల్ప ఖర్చు (రూ.14.12 లక్షలు)ను ప్రకటించిన అభ్యర్థిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రెండో స్థానంలో నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల విశేషాలతో కేంద్ర ఎన్నికల సంఘం అట్లాస్‌ ప్రకటించింది. దానిలో తెలుగు రాష్ట్రాల విశేషాలివీ..
* 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌లో దేశంలోనే అత్యధిక మంది (185 మంది) అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సరకన్ల రాజారెడ్డి కేవలం 84 ఓట్లు సాధించారు. దేశంలోనే అత్యల్పంగా ఓట్లు పొందిన అభ్యర్థిగా రికార్డులకెక్కారు.
* 31,50,313 మంది ఓటర్లతో తెలంగాణలోని మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా నిలిచింది. 16,38,054 మంది పురుషులు, 15,11,910 మంది మహిళా ఓటర్లతో అత్యధిక పురుష, మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగానూ ఖ్యాతిగాంచింది.
* తెలుగు రాష్ట్రాల్లో సర్వీసు ఓటర్లు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 13,690 మంది ఉన్నారు. ఈ విభాగంలో దేశంలో దీనిది 15వ స్థానం.
* ఓటర్లలో మహిళల నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 7వ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,018 మహిళా ఓటర్లు ఉన్నారు.
* థర్డ్‌ జెండర్‌ ఓటర్లలో ఆంధ్రప్రదేశ్‌ (3,957) 4వ, తెలంగాణ (1,504) 8వ స్థానంలో నిలిచాయి.
* దివ్యాంగ ఓటర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ (5,21,029) 4, తెలంగాణ (5,13,762) 5వ స్థానంలో నిలిచాయి.
* 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 266 మంది, తెలంగాణలో 404 మంది డిపాజిట్లు కోల్పోయారు.
* అత్యధిక ఓట్లు పోలైన నియోజకవర్గాల్లో బాపట్ల (86.47%) 6వ స్థానంలో, ఒంగోలు (86.35%) 7వ స్థానంలో, నర్సరావుపేట (86.25%) 8వ స్థానంలో నిలిచాయి. 2014 ఎన్నికల్లోనూ ఈ మూడు నియోజకవర్గాలు అవే స్థానాల్లో ఉండటం విశేషం. అత్యల్ప ఓటింగ్‌ నమోదైన నియోజకవర్గాల్లో హైదరాబాద్‌ (44.84%) 4, సికింద్రాబాద్‌ (46.50%) 6వ స్థానాల్లో నిలిచాయి.
* అత్యధిక నోటా (47,977) ఓట్లు పోలైన నియోజకవర్గాల్లో అనకాపల్లి (34,897) 12, విజయనగరం (29,501) 21, తిరుపతి (25,781) 28, శ్రీకాకుళం (25,545) 29వ స్థానాల్లో ఉన్నాయి.
* అతి తక్కువ ఆధిక్యతతో గెలిచిన ఎంపీల్లో గుంటూరు (0.31%), విశాఖపట్నం (0.36%), భువనగిరి (0.43%), శ్రీకాకుళం (0.57%), జహీరాబాద్‌ (0.6%), విజయవాడ (0.68%), మల్కాజ్‌గిరి (0.7%) ఉన్నారు.
* ఎన్నికల్లో అతి తక్కువ వ్యయాన్ని చూపినవారిలో కర్నూలు ఎంపీ సంజీవకుమార్‌ (రూ.21.27 లక్షలు), అనంతపురం ఎంపీ తలారి రంగయ్య (రూ.19.43 లక్షలు), అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి (రూ.17.66 లక్షలు), అమలాపురం ఎంపీ చింతా అనూరాధ (రూ.16.74 లక్షలు), విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ (15.83 లక్షలు), తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు (రూ.15.06 లక్షలు) ఉన్నారు.