ఆర్మీలో మ‌గ‌వాళ్ల ఫిట్‌నెస్ రూల్స్ ఆడ‌వాళ్ల‌కు ఎందుకు: సుప్రీంకోర్టు

0
469

న్యూఢిల్లీ: శారీర‌కంగా దృఢంగా లేర‌ని అర్హ‌త కోల్పోయిన మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిట్‌నెస్ ప్ర‌మాణాలు లేని కార‌ణంగా కొంద‌రు మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ఆర్మీలో ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వ‌డం లేదు. ఈ అంశంపై ఇవాళ అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. మెడిక‌ల్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ కావాల‌ని కోర‌డం అసంబ‌ద్ద‌మ‌ని, ఏక‌ప‌క్షంగా ఉంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. సుప్రీం ఆదేశాల‌ను ఆర్మీలో అమ‌లు చేయ‌డంలేద‌ని వేసిన పిటిష‌న్‌పై కోర్టు స్పందించింది.

షేప్-1 క్రైటీరియాగా భావిస్తున్న‌ శారీర‌క ప్ర‌మాణాలు కేవ‌లం మ‌గ‌ ఆఫీస‌ర్లకు మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌ని, ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇచ్చిన తొలి రోజుల్లో ఆ ప్ర‌మాణాల‌ను పాటించిన‌ట్లు సుప్రీంకోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ఆర్మీలో ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు గ‌త ఏడాది త‌న తీర్పులో ఆదేశించింది. పురుషుల‌కు అమ‌లు అవుతున్న షేప్‌-1 ఫిట్‌నెస్ ప్ర‌మాణాలు మ‌హిళ‌ల‌కు వ‌ర్తించ‌వు అని, ఆ ప్ర‌మాణాలు మ‌హిళ‌ల్లో ఆశించ‌డం అసంబ‌ద్ద‌మ‌ని కోర్టు చెప్పింది. షేప్‌-1 క్రైటీరియా ఏక‌ప‌క్షంగా ఉంద‌ని, దాంట్లో వివ‌క్ష ఉన్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

80 మంది మ‌హిళా ఆఫీస‌ర్లు వేసిన పిటిష‌న్ పై కోర్టు స్పందిస్తూ.. మ‌న స‌మాజ నిర్మాణాన్ని గుర్తించాల‌ని, మ‌గ‌వారి కోస‌మే మ‌గ‌వాళ్లు త‌యారు చేసిన‌ట్లు రూల్స్ అమ‌లులో ఉన్న‌ట్లు సుప్రీం త‌న తీర్పులో చెప్పింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌, విజిలెన్స్ క్లియ‌రెన్స్ ఆధారంగా మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ డాక్ట‌ర్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. మ‌హిళా ఆఫీసర్లు ఆ ల‌బ్ధి పొందాల‌ని కోర్టు త‌న తీర్పులో స్ప‌ష్టం చేసింది.