సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్ ల కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు నం XXIV/2020 ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన సమ న్యాయం అనే హక్కు దేశ ప్రజలందరికీ, ఈ రీజినల్ బెంచ్ల వల్ల అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నల్లకుంటలోని సౌత్ ఇండియా జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందేలా పాలకపక్షం, ప్రతిపక్షం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత దశాబ్ద కాలంగా సౌతిండియాలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నామని ఆయన వివరించారు.

జూనియ‌ర్ సివిల్ జ‌డ్జిగా హారిక‌

ఈ పోరాటంలో భాగంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి. రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజూ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, సౌతిండియా పార్లమెంటరీ సభ్యులని కలిసి మెమోరాండమ్ సమర్పించడం జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్ హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే, సౌతిండియా ప్రజలందరికీ ఈ సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్ వల్ల రాజ్యాంగం కల్పించిన న్యాయం అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించిన రీజినల్ బెంచ్ ఏర్పాటును, సరైన కారణాలు లేకుండా తిరస్కరించడాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒప్పుకోలేదని, అందువల్ల రీజినల్ బెంచ్ ల ఆవశ్యకతను తెలియజేస్తూ, మళ్లీ తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి పంపించాయని ఆయన తెలిపారు.

రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల మారుమూల ప్రజలకు సుప్రీంకోర్టు వల్ల న్యాయం పొందే హక్కు కోల్పోతున్నారని, ఈ సమస్య పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించిందన్నారు. రీజినల్ బెంచ్ ఏర్పాటు చేసినప్పుడే చిరకాల స్వప్నం సాకారమవుతుందని ఆయనన్నారు. ప్రజలందరికీ న్యాయం దక్కేలా చేయడం తన కనీస బాధ్యతగా భావిస్తున్నానని నాగేందర్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ సభ్యులు వాకిటివెంకటేశం, పెండెం సతీష్, మోహన్రావు, వెంకటేశ్, మల్లిఖార్జున్, జ్యోతిరావు, మొజోంఖాన్, శ్రీనివాస్, శారదా, వెంకట్, పి.ఎన్.శర్మ, తీగె సత్యనారాయణ, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.