ఎండలో 5 గంటలకు మించి ఉంటే సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సిందే..!

0
479

సూర్య కిరణాల ద్వారా భూమిపైకి ప్రసారమయ్యే అతినీలలోహిత, పరారుణ కిరణాలు మన శరీరానికి హాని కలిగిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటి వల్ల చర్మ సమస్యలు వస్తాయి. చర్మ క్యాన్సర్ కూడా వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే నిత్యం 5 గంటల కన్నా ఎక్కువ సమయం ఎండలో గడిపే వారు కచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

సన్‌స్క్రీన్ లోషన్లలో మనకు ఎస్‌పీఎఫ్ 15 నుంచి ఎస్‌పీఎఫ్ 50 ప్లస్ వరకు రక్షణనిచ్చే రకరకాల లోషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎస్‌పీఎఫ్ ఎంత ఎక్కువ ఉంటే మన చర్మానికి అంత రక్షణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే సూర్యకాంతితోపాటు 93 శాతం వరకు కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

అదే ఎస్‌పీఎఫ్ 30 అయితే 97 శాతం వరకు, ఎస్‌పీఎఫ్ 50 ఉన్న లోషన్ అయితే 98 శాతం వరకు, ఎస్‌పీఎఫ్ 50 ప్లస్ ఉన్న లోషన్ అయితే 100 శాతం మనకు అతినీలలోహిత, పరారుణ కిరణాల నుంచి రక్షణ అందిస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం 5 గంటల కన్నా ఎక్కువ సమయం పాటు ఎండలో ఉండేవారు ఎస్‌పీఎఫ్ 50 ప్లస్ ఉన్న లోషన్ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.