21 ఏళ్ల సర్వీసులో ఒక్క సెలవు కూడా తీసుకోని మోదీ

0
495

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గత 21 ఏళ్లుగా ప్రజాసేవలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఇంతవరకూ తాను ఒక్క సెలవు కూడా తీసుకోలేదని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశం, ప్రజల కోసం నిరంతర సేవలు అందించాలని ఎంపీలకు ప్రధాని సూచించారు. మంగళవారంనాడు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. కోవిడ్ మహమ్మారి ఒక సవాలు అనీ, ఆ సమయంలో అత్యుత్తమంగా పనిచేసినట్టు తాను భావిస్తున్నానని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్ కాలంలో భారతదేశం పనితీరు ప్రపంచ దేశాల అభినందనలు అందుకొందని అన్నారు.

కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇండియా పనిచేసిన తీరు 110 దేశాల నేతల ప్రశంసలు అందుకున్నట్టు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పేర్కొన్నట్టు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ తెలిపారు. కష్టకాలంలో 130 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపై నిలిచి ఏ ఒక్కరూ ఆకలితో మరణించకుండా పరస్పరం సహకరించుకోవడాన్ని కూడా ప్రధాని అభినందించినట్టు చెప్పారు. పార్లమెంటు సమావేశాల ఎప్పుడు జరిగినా అందరు తప్పనిసరిగా హాజరుకావాలని కూడా సమావేశంలో పాల్గొన్న ఎంపీలకు ప్రధాని సూచించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా మాట్లాడారు.