నెట్‌లో అమ్మ‌కానికి న‌కిలీ వ్యాక్సిన్, కొవిడ్ టెస్ట్ స‌ర్టిఫికెట్‌లు

0
727

న్యూఢిల్లీ: న‌కిలీ వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ 250 డాల‌ర్లు. కొవిడ్ నెగ‌టివ్ ఫ‌లితం కావాలంటే 25 డాల‌ర్లు. ప్ర‌స్తుతం డార్క్‌నెట్‌లో దొరుకుతున్న న‌కిలీ స‌ర్టిఫిక‌ట్లకు రేట్లివి. చెక్ పాయింట్ రీసెర్స్ (సీపీఆర్‌) చేసిన విచార‌ణ‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది. డార్క్‌నెట్‌కు సంబంధించిన కొన్ని వెబ్‌సైట్లు ఈ న‌కిలీ దందాను న‌డుపుతున్న‌ట్లు సీపీఆర్ ఇన్వెస్టిగేష‌న్ స్ప‌ష్టం చేసింది. కేవ‌లం మీ వివ‌రాలు, డ‌బ్బు పంపితే మీరు వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లుగా స‌ర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు రిపోర్ట్ మీకు పంపిస్తారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్రాలు, దేశాల మ‌ధ్య ప్ర‌యాణాలు క‌ష్టంగా మారుతున్నాయి. స‌ర్టిఫికెట్లు ఉంటేనే కొన్ని దేశాలు అనుమ‌తినిస్తున్నాయి. ఈ నిబంధ‌న‌లే ఇప్పుడు న‌కిలీ దందాకు ఊత‌మిస్తున్నాయి. ప్ర‌స్తుతం డార్క్‌నెట్‌లో ఫేక్ వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్లు, గ్రీన్ పాస్‌పోర్ట్‌లు, కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు భారీగా క‌నిపిస్తున్న‌ట్లు సీపీఆర్ నివేదిక వెల్ల‌డించింది.
న‌కిలీ వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్లు
డార్క్‌నెట్‌లోని కొన్ని వెబ్‌సైట్లు అచ్చూ ప్ర‌భుత్వం జారీ చేస్తున్న‌టువంటి వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ల‌నే సృష్టిస్తున్నాయి. వీటిని చూపించి విమానాలు ఎక్కొచ్చు. స‌రిహ‌ద్దులు దాటొచ్చు. వ్యాక్సిన్ వేసుకున్న ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే కొన్ని దేశాలు అనుమ‌తిస్తుండ‌టంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఈ వ్యాక్సిన్ సర్టిఫికెట్లే కొన్ని దేశాల మ‌ధ్య గ్రీన్ పాస్‌పోర్ట్‌లుగా ప‌ని చేస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో కేవ‌లం ఒక శాతం మందికే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ న‌కిలీ వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ల‌కు డిమాండ్ మ‌రింత పెరిగింది. అమెరికా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌కు 200 డాల‌ర్లు, ర‌ష్యాది కావాలంటే 135 డాల‌ర్లు, యూకేది కావాలంటే 150 డాల‌ర్ల‌కు ఇస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌లో డార్క్‌నెట్‌లో క‌నిపించిన‌ట్లు సీపీఆర్ నివేదిక తెలిపింది. ఇలాగే కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ కూడా న‌కిలీవి దొరుకుతున్నాయి. ఇందులో రెండు కొంటే ఒక‌టి ఫ్రీ ఆఫ‌ర్లు కూడా ఇస్తున్నారు.