కార్లు ముందుకు..బైకులు వెనక్కి

0
511

ఫిబ్రవరిలో 10% పెరిగిన పీవీ అమ్మకాలు
ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 16% క్షీణత

దిల్లీ: ఫిబ్రవరిలో ప్రయాణికుల వాహనాల(పీవీ) రిటైల్‌ విక్రయాలు 10.59 శాతం పెరిగి 2,54,058కు చేరాయి. 2020 ఇదే నెలలో తక్కువ అమ్మకాల నేపథ్యంలోనే ఈ పెరుగుదల కనిపించిందని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య(ఫాడా) మంగళవారం తెలిపింది. ఇదే సమయంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 13,00,364 నుంచి 16.08% క్షీణించి 10,91,288కు పరిమితయ్యాయి.
♦ వాణిజ్య వాహనాలు; త్రిచక్ర వాహనాల విక్రయాలు సైతం వరుసగా 29.53%; 49.65% మేర తగ్గి వరుసగా 59,020; 33,319గా నమోదయ్యాయి.
♦ ట్రాక్టర్లు మాత్రం 18.89% వృద్ధితో 61,315 అమ్ముడుపోయాయి.
♦ మొత్తం మీద అన్ని విభాగాలు కలిపి అమ్మకాలు 17,31,628 నుంచి 13.43% మేర తగ్గి 14,99,036 వాహనాలకు పరిమితమయ్యాయి.
బైక్‌లకు బ్రేకులందుకే..: కొన్ని రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో ద్విచక్ర వాహనాలకు గిరాకీ తగ్గిందన్నారు. ‘అధిక ఇంధన ధరలూ విక్రయాలపై ప్రభావం చూపాయన్నారు. వాహన రుణ సమస్యలకు తోడు, విద్యా సంస్థలు మూత పడడం, సరఫరా సమస్యలతో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్‌ తగ్గింద’న్నారు. అధిక ఇంధన ధరల వల్ల ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. మార్చిలో కొంత సానుకూలతలు కనిపించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.