మీడియా ప్రతినిధుల సంక్షేమానికి కృషి : అల్లం నారాయణ

0
825

వార్తా లోకం ప్రతినిధి ,మేడ్చల్ /శామీర్ పేట: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. శామీర్ పేట మండలం తూంకుంటలోని మొగుళ్ల వెంకట్ రెడ్డి గార్డెన్ లో మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే మహాసభలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్ అధ్యక్షతన జరిగాయి. సభలకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు జర్నలిస్టుల సంక్షేమ నిధి రూ. 10 కోట్లు ఉంటే నేడు రూ. 100 కోట్లు ఉన్నాయని ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జర్నలిస్టులకు హెల్త్ కార్డులను అందజేసినట్లు తెలిపారు. గతంలో అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో జర్నలిస్టులకు వైద్య చికిత్సలు హెల్త్ కార్డుల ద్వారా అందాయని, ప్రస్తుతం నిమ్స్ లో మాత్రమే అందుతున్నాయని తెలిపారు. అయితే అన్నికార్పొరేట్ ఆసుపత్రులలో హెల్త్ కార్డుల ద్వారా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు వివరించారు. ఇప్పటి వరకు 500 మందికి పింఛన్లు అందజేయగా, రూ.25 కోట్లను జర్నలిస్టుల ఖర్చు కోసం వెచ్చించినట్లు తెలియజేశారు. జర్నలిస్టులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 6 కోట్లు వచ్చాయని, కరోనా సోకిన దాదాపు 4 వేల మందికి పైగా రూ.7 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఇచ్చినట్లు వివరించారు.

ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవడానికి కోట్లాడింది టీయూడబ్ల్యూజే (హెచ్) 143 నేనని తెలిపారు. ఉద్యమ కాలంలో 144 సెక్షన్ అమలు చేసినా ముందుండి కోట్టాడినట్లు గుర్తు చేశారు. కొన్ని సంఘాలు పైరవీల కోసమే ఏర్పడ్డాయని మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన జర్నలిస్టులను ఆ హేళన చేసిందని దుయ్యబట్టారు. జనవరి 8,9,10వ తేదీలలో జాతీయ మహా సభలను నిర్వహిస్తున్నామని, ఈ సభలకు భారీ ఎత్తున తరలిరావాలని అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేస్తుంది టీయూడబ్ల్యూజే మాత్రమేనన్నారు. జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడేందుకు ఐజేయూతో కలువబోతున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో టెమ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్,ప్రధాన జ కార్యదర్శి రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ముత్తయ్య గౌడ్, కార్యవర్గ సభ్యుడు రంగు వెంకటేశ్ గౌడ్, మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షులు శేఖర్ సాగర్, అమర్, భాస్కర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు కల్లెపల్లి రవిచంద్ర, విల్సన్, వెంకటేశ్, పట్టురి రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.