భూమికి సమీపం నుంచి వెళ్లిన పెద్ద గ్రహశకలం

0
567

వాషింగ్టన్‌: అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఒక పెద్ద గ్రహశకలం ఆదివారం భూమికి సమీపం నుంచి అత్యంత వేగంతో దూసుకెళ్లింది. జీఎంటీ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఇది భూమిని క్రాస్‌ చేసినట్లు ఫ్రాన్స్‌లోని అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రం తెలిపింది. 2001 FO32 పేరుతో పిలిచే ఈ గ్రహశకలం ఈ ఏడాది భూమికి చేరువగా వచ్చే వాటిలో అతి పెద్దదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. భూమికి 20 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది పాస్ అయ్యిందని పేర్కొంది. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి ఇది 5.25 రెట్లని తెలిపింది.

900 మీటర్లు (3 వేల అడుగులు) పొడవైన ఈ గ్రహశకలాన్ని 20 ఏండ్ల కిందట గుర్తించినట్లు నాసా తెలిపింది. గంటకు 1,24,000 కిలోమీటర్ల వేగంతో భూమిని క్రాస్‌ అయిన 2001 FO32 వల్ల ప్రస్తుతం లేదా మరో వంద ఏండ్లలో ఎలాంటి ముప్పు లేకపోయినా భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని అంచనా వేసింది. మన సౌరవ్యవస్థ ఆవిర్భానికి చెందినగా భావిస్తున్న ఈ గ్రహశకలం పరిమాణం, దాని ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతిని అధ్యయనం చేయడం ద్వారా అందులోని మూలకాల గురించి తెలుసుకోవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ గ్రహశకలం ఉపరితలాన్ని సూర్యరశ్మి తాకినప్పుడు, శిలలోని ఖనిజాలు కొన్ని తరంగ దైర్ఘ్యాలను గ్రహిస్తాయని, మరికొన్ని ప్రతిబింబిస్తాయని నాసా తెలిపింది. ఆస్టరాయిడ్‌ ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతి వర్ణపటాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ గ్రహశకలం ఉపరితలంపై ఉన్న ఖనిజాల రసాయనాలను అంచనా వేయవచ్చని పేర్కొంది. 2001 FO32 ఆస్టరాయిడ్‌ తిరిగి 2052లో భూమికి సమీపంగా వెళ్తుందని నాసా వెల్లడించింది.