ఇకపై తక్కువ ఖర్చుతో సుప్రీంకోర్టులో కేసులు..అది ఎలాగో తెలుసా ?

0
646

సుప్రీంకోర్టులో కేసు వేయడం చాలా తేలిక
కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ధర్మాసనం

న్యూఢిల్లీ

సుప్రీంకోర్టులో కేసులు వేసి, న్యాయం పొందాలంటే అది సామాన్యులకు అందని ద్రాక్ష‌గానే మారింది. అయితే, ఈ పరిస్థితిలో మార్పునే తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ ప‌థ‌కం పేరు మ‌ధ్య ఆదాయ వ‌ర్గ (ఎంఐజీ) ప‌థ‌కం. నెల‌కు 60 వేల రూపాయ‌ల లోపు, ఏడాదికి 7ల‌క్ష‌ల 50వేల రూపాయ‌ల‌లోపు ఆదాయం క‌లిగిన వారు ఈ ప‌థ‌కం ప‌రిధిలోకి వ‌స్తారు. వీరి కోసం సుప్రీంకోర్టు మ‌ధ్య ఆదాయ వ‌ర్గ న్యాయ స‌హాయ సొసైటీని ఏర్పాటు చేసింది. దీనికి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్యాట్ర‌న్ ఇన్ ఛీఫ్‌గా, అటార్నీ జ‌న‌ర‌ల్ ఎక్స్ ఆఫీషియో వైస్ ప్రెసిడెంట్‌గా, సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గౌర‌వ కార్య‌ద‌ర్శిగా, సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదులు స‌భ్యులుగానూ ఉంటారు.

ఫీజులెంత ఇవ్వాలి..!

న్యాయం పొందాల‌నుకునే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు రూ.500 సొసైటికి, రూ. 750 స‌ర్వీస్ ఛార్జీ కింద చెల్లిస్తే స‌రిపోతుంది. అనంత‌రం పిటిష‌న్‌ను సొసైటీలో దాఖ‌లు చేయాలి. వీటిని అడ్వ‌కేట్ ఆన్ రికార్డు ( ఏఓఆర్‌)కు అప్ప‌గిస్తారు. ఈ కేసు విచార‌ణ‌కు అర్హ‌మైంద‌ని ఏఓఆర్ భావిస్తే, దీనిపై కోర్టులో వాద‌న‌లు వినిపించేందుకు ఒక న్యాయ‌వాదికి బాధ్య‌త‌ల‌ను సొసైటీ అప్ప‌గిస్తుంది. పిటిష‌న్ న్యాయ వివాదానికి అర్హ‌మైంది కాద‌ని, ఏఓఆర్ నిర్ణ‌యిస్తే స‌ర్వీస్ ఛార్జి కింద వ‌సూలు చేసిన రూ. 750 మిన‌హాయించ‌కుని మిగ‌తా సొమ్మును వెన‌క్కి ఇచ్చేస్తారు. సొసైటీ ద్వారా సుప్రీంకోర్టులో దాఖ‌లయ్యే కేసులు సాధార‌ణ కేసుల్లాగే విచార‌ణ‌కు వ‌స్తాయి..

తీర్పు ఎలా వ‌స్తుంది..!

తీర్పు ఎలా వచ్చినా దాంతో సొసైటీకి సంబంధం ఉండదు. కేసు దాఖలు చేయటం, న్యాయవాదిని ఎంపిక చేసుకోవటంలో మాత్రమే సొసైటీ సహకరిస్తుంది. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌టం అనేది ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం అయిన నేప‌ధ్యంలో సాధార‌ణ ఫీజుతోనే త‌మ వివాదాల‌ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి, న్యాయం పొందే అవ‌కాశాన్ని ప్ర‌జ‌ల‌కు అందివ్వాల‌న్న‌దే సొసైటీ ఉద్దేశ్యం. కేసును చేప‌ట్టిన న్యాయ‌వాది నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాడ‌ని నిరూప‌ణ అయితే, సుప్రీంకోర్టు స‌ద‌రు న్యాయ‌వాదిని ప‌థ‌కం ప్యానెల్ నుంచి తొల‌గిస్తుంది. ఈ ప‌థ‌కానికి సుంబంధించిన పూర్తి వివ‌రాలు ఫీజుల స‌మ‌గ్ర స్వ‌రూపం
http://supremecourtofindia.nic.in/mig.html అనే సైట్లో లభిస్తాయి.