సంపన్న కుటుంబాలు 4.12 లక్షలు

0
1334

హురున్‌ ఇండియా వెల్త్‌ రిపోర్టు విడుదల

కనీసం రూ.7 కోట్ల ఆస్తి ఉన్న కుటుంబాలకు జాబితాలో స్థానం

అత్యధికంగా మహారాష్ట్రలో..

టాప్‌-10లో తెలుగు రాష్ట్రాలు

న్యూఢిల్లీ: దేశంలో డాలర్‌ మిలియనీర్‌ (కనీసం రూ.7 కోట్ల ఆస్తి) కుటుంబాలు 4.12 లక్షలున్నాయిట. మంగళవారం విడుదలైన ‘హురున్‌ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌ 2020’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంపన్న కుటుంబాల్లో 70 శాతం దేశంలోని టాప్‌-10 రాష్ట్రాల్లోనే ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది.

మరిన్ని ముఖ్యాంశాలు..

+ డాలర్‌ మిలియనీర్‌ కుటుంబాలు అత్యధికంగా (56,000) మహారాష్ట్రలో ఉన్నాయి. అందులో 16,933 కుటుంబాలు ముంబై మహానగరంలో నివసిస్తున్నాయి. న్యూఢిల్లీలో 16,000, కోల్‌కతాలో 10,000 కుటుంబాలున్నాయి. బెంగళూరులో 7,500కు పైగా, చెన్నైలో 4,700 మేర సంపన్న కుటుంబాలున్నాయి.

+ అత్యధిక మిలియనీర్‌ కుటుంబాలున్న ముంబై.. దేశ జీడీపీకి 6.16 శాతం, ఢిల్లీ 4.94 శాతం వాటా అందిస్తున్నాయి.

+ దేశంలో 5.64 కోట్ల మధ్య తరగతి కుటుంబాలున్నాయి. రూ.7 కోట్ల కంటే తక్కువ ఆస్తి కలిగి, ఏటా రూ.2.5 లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నవారిని హురున్‌ ఈ జాబితాలో చేర్చింది.

+ హురున్‌ దేశంలో సరికొత్త మధ్య తరగతి వర్గాన్ని గుర్తించింది. ఏటా సగటున రూ.20 లక్షలు పొదుపు చేస్తున్న 6.33 లక్షల కుటుంబాలను ఈ కేటగిరీలో చేర్చింది.