ఆస్కార్ బరి నుంచి ‘ఆకాశమే నీ హద్దురా’ ఔట్

0
1458

ఆస్కార్ బరిలో మరోసారి ఇండియన్ సినిమాలకు నిరాశే ఎదురైంది. తమిళ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాపై ఈ సారి చాలా ఆశలే పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఈ సినిమాకు నిరాశే ఎదురైంది. చివరి నిమిషంలో ఆస్కార్ బరి నుంచి తప్పుకుంది ఈ చిత్రం. ఇందులో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి నటించింది. ‘సూరారై పోట్రు’గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురాగా విడుదలైంది. థియేటర్స్ మూసి ఉన్న సమయంలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను నేరుగా విడుదల చేశారు. సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల ఆస్కార్ అవార్డ్ పోటీలో నామినేషన్ సాధించింది. మొత్తం 366 చిత్రాల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేయ‌గా.. అందులో మ‌న దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది.

ఇప్పుడు అది కూడా ఆస్కార్‌ బరిలోంచి వైదొలిగింది. అకాడమీ స్క్రీనింగ్‌కు ఎంపికైన సూరారై పోట్రు సినిమా తర్వాత రౌండ్స్ కు నామినేట్ అవ్వడంలో విఫలమైంది. దీంతో మార్చి 15న ఆస్కార్‌ నుంచి అధికారికంగా తప్పుకుంది ఈ సినిమా. ఇదిలా ఉంటే 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 2021 ఏప్రిల్ 25న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందులో ఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి ఎన్నికైన ఒకే ఒక్క సినిమా సూరారై పోట్రు ఒక్కటే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ ఒరిజ‌న‌ల్ స్కోర్‌తో పాటు పలు విభాగాల్లో ఎంపికైంది ఈ చిత్రం. ఈ ఎంట్రీ వచ్చినపుడు అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. ఓ తమిళ సినిమాకు ఇంతటి ఘనత లభించడంతో దర్శక నిర్మాతలు కూడా పండగ చేసుకున్నారు.

సౌత్ సినిమాకు దక్కిన గౌరవం అంటూ ఆనందంలో మునిగిపోయారు అభిమానులు. అయితే ఇప్పుడు సినిమా తప్పుకోవడంతో తీవ్ర నిరాశలో పడిపోయారు అభిమానులు. త‌క్కువ ధ‌ర‌కే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన‌ ఏయిర్‌ డెక్కన్‌ సీఈఓ గోపినాథ్‌ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలు తీసుకుని దానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించింది సుధా కొంగర. సిఖ్య, 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించాడు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు.